రెండు రోజుల గడువు ఇస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

రెండు రోజుల గడువు ఇస్తున్నాం..

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నాం.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలు తప్పవని బీజేపీ బృందం హెచ్చరించింది. రైతు గోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ బృందం బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించింది. గణపురం మండలంలోని చెల్పూరు, కాటారం మండలంలోని కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంది. కాటారంలో ధాన్యం దహనం చేసి నిరసన తెలిపి కేసు పాలైన తిరుపతిని బీజేపీ నేతలు పరామర్శించారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు రఘునందర్‌రావు, ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ 40 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని, బీజేపీ బృందం వస్తున్న విషయాన్ని తెలుసుకొని గన్నీ బ్యాగులు, లారీలు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంకా 70 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని పేర్కొన్నారు. కాటారం మండలంలో నిరసన తెలిపిన 9 మంది రైతులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టిందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు తాము ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, రామారావు పటేల్‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు చందుపట్ల కీర్తిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, నిషిధర్‌రెడ్డి, ఎరుకల గణపతి, కన్నం యుగేంధర్‌, మహిపాల్‌రెడ్డి, జయశ్రీ, కరివేద మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళనలే

బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు, కాటారంలో పర్యటన

Advertisement
 
Advertisement
Advertisement