జఫర్‌గఢ్: మండల కేంద్ర శివారు వడ్డెగూడేనికి చెందిన కె. రాజేందర్ ఇటీవల మృతి చెందాడు. కాగా, విషయం తెలుసుకున్న రాజేందర్‌తో 2010–11లో పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థులు స్నేహితుడి కుటుంబానికి బుధవారం రూ.26,500, 50కిలో బియ్యం అందజేశారు. అనంతరం రాజేందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ
బచ్చన్నపేట: కార్యకర్తల కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అన్నారు. బసిరెడ్డిపల్లి సర్పంచ్ నల్ల సిద్దినర్సమ్మ మల్లయ్యల కుమారుడు వెంకటేష్ ఇటీవల మృతి చెందాడు. కాగా, బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 వేల సాయం అందజేశారు. మండల ఉపాధ్యక్షుడు గార్లపాటి మహిపాల్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు కనకయ్య తదితరులు ఉన్నారు.
నిత్యావసర సరుకుల
అందజేత
జనగామ: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అభిషేక్ జగనీ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని బీరప్ప ఆలయం ఏరియాకు చెందిన ఓ పేద కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను బుధవారం కాసాల సంతోష్ కుమార్ అందజేశారు. అంతకు ముందు సంతోష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను న్విహించారు.
మహాసభ ఏర్పాట్లపై సమావేశం
రఘునాథపల్లి: ఎస్టీ రిజర్వేషన్ అమలుకు 50 సంవత్సరాలైన సందర్భంగా జూన్ 18న మండల కేంద్రంలో నిర్వహించనున్న మహాసభ ఏర్పాట్లపై బుధవారం మండల కేంద్రంలో గిరిజన నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువకులతో సమావేశం నిర్వహించి మహాసభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ సంఘం నాయకులు కొర్ర రాజేందర్‌నాయక్, బానోత్ భిక్షపతినాయక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాల మేరకు గిరిజనుల సామాజిక, విద్య, ఆర్థిక అభివృద్ధి కోసం రాజ్యాంగలో ఎస్టీ రిజర్వేషన్లు కల్పించబడినట్లు పేర్కొన్నారు. హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గుగులోత్ కొమురెల్లి, శ్రీనునాయక్, దేవస్వామి, ఈర్యనాయక్, సోమన్న, సుందర్, భజన్‌నాయక్, శంకర్‌నాయక్ తదితరులు ఉన్నారు.
30 నుంచి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్
బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలో ఈనెల 30వ తేదీ నుంచి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలస్థాయిలో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ పోటీలను సిద్దులగుట్ట ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంట్రీ ఫీజు రూ.వెయ్యి చెల్లించాలన్నారు. విజేతలకు మొదటి బహుమతి రూ. 20 వేలు, ద్వితీయ బహుమతి రూ. 10వేల నగదు అందిస్తామని తెలిపారు. క్రీడాకారులకు అన్ని వసతులను కల్పిస్తున్నామని, ఆసక్తిగల క్రీడాకారులు టీం పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7702259398, 9989801582 నంబర్లను సంప్రదించాలని కోరారు.
‘చర్య తీసుకోవాలి’
బచ్చన్నపేట: మండలంలోని పడమటికేశ్వాపూర్ గ్రామంలో దళితుల భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన దళిత రైతు తాడెం నరేందర్‌కు చెందిన రెండెకరాల భూమిని కొందరు అన్యాకాంతం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారిపై చర్యతీసుకుని న్యాయం చేయాలన్నారు. డీబీఎఫ్ నాయకులు సతీష్, ఉపసర్పంచ్ తాడేం నరేందర్, గణేష్, చరణ్ పాల్గొన్నారు.


