జఫర్‌గఢ్: వేలాది రూపాయల పెటుబడులు పెట్టి సాగు చేసిన ఆయిల్ పామ్ తోటను కాపాడేందుకు ఓ రైతు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే 5 బోర్లు వేయగా అందులో మూడు ఫెయిల్ అయ్యాయి. మిగిలిన రెండు బోరు బావులల్లో మాత్రం అంతంత మాత్రంగానే నీరు వస్తోంది. వచ్చిన కొద్ది పాటి నీటిని నేరుగా పంటలకు అందించడంతో ఏమాత్రం సరిపోక వినూత్మ పద్ధతిలో పంటలకు సాగునీరందిస్తూ కాపాడుతున్నాడు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని తాటికాయల కుమారస్వామి అనే రైతు తనకున్న 13 ఎకరాల్లో కొన్నేళ్ల క్రితం ఆయిల్‌పామ్ తోటను సాగు చేశాడు. పంటకు సరిపడా నీటిని అందించేందుకు రూ. 4 లక్షల ఖర్చు చేసి 5 బోర్లు వేశాడు. వాటిలో మూడు బోర్లల్లో చుక్కనీరు పడకపోగా రెండు బోర్లల్లో మాత్రమే కొద్దిపాటి నీరు వచ్చింది. ఆ వచ్చిన కొద్ది పాటి నీరు పంటకు ఏమాత్రం సరిపోకపోవడం వల్ల రూ.లక్షలు వెచ్చించి పొలంలో పెద్ద ఇంకుడు గుంత తవ్వించి పెద్ద ప్లాస్టిక్ కవర్‌ను చుట్టూ ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేస్తున్నాడు. మోటరు సాయంతో స్పింక్లర్ల ద్వారా ఆయిల్ పామ్ మొక్కలకు సరిపడా నీటిని అందిస్తూ పంటను కాపాడుతున్నాడు. అయిల్‌పామ్ సాగు వల్ల దిగుబడి ఏమో కాని పెట్టుబడులు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
5 బోర్లు వేస్తే మూడు ఫెయిల్
మిగిలిన రెండింటితో వినూత్న పద్ధతిలో తోటకు నీరు


