స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ పూర్తి బాధ్యత ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచడంతో పాటు పనులను కల్పించడం, ఎన్‌ఎంఎంఎస్ ఫేస్ అథెంటికేషన్ హాజరు తదితర ఏడు రకాల రిజిష్టర్ల నిర్వహణ పక్కాగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామాల్లో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరగడంతో పాటు పనులు పారదర్శకంగా జరుగుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెబాట పట్టడంతో వారిని పక్కనబెట్టి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మొదటగా కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించింది. దాంతో ఉపాఽధి హామీ పనులను కార్యదర్శులు పర్యవేక్షించారు. టెక్నికల్ అసిస్టెంట్లతో కలిసి అన్ని పనులను వారే నిర్వహించేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంది. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ రెగ్యులర్ పనులకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి హామీ పనులను విస్మరిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈజీఎస్ పనుల పూర్తిస్థాయి పర్యవేక్షణ పంచాయతీ కార్యదర్శులు చేయాలని తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డీఆర్‌డీఓల ద్వారా ఎంపీడీఓ, ఎంపీఓలతో పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి పనుల పర్యవేక్షణను ప్రాధాన్యంగా చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈజీఎస్‌లో కార్యదర్శుల విధులు..
ఉపాధి హామీ పథకంలో కార్యదర్శులు ఏ విధులు నిర్వహించాలో స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఉపాధి హామీ సిబ్బంది సహాయంతో గ్రామాల్లో వందరోజుల పనులు, వన మహోత్సవ కార్యక్రమాలు చేపట్టి పర్యవేక్షించాలి. మేట్‌లను నియమించడంతో పాటు వారితో కలిసి కూలీల నుంచి పని డిమాండ్ వివరాలను తీసుకోవాలి. కూలీలు మస్టర్లు నమోదు చేసుకునేలా చూడడంతో పాటు వారం చివరలో వాటిపై కౌంటర్ సైన్ చేసి టెక్నికల్ అసిస్టెంట్లకు అప్పగించాలి. ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో కూలీల ఫేస్ అథెంటికేషన్ ద్వారా హాజరును అప్‌లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీటితో జాబ్‌కార్డుల అప్‌డేషన్, వారానికోసారి సమావేశాల నిర్వహణ, పని ప్రదేశాల్లో బోర్డును తనిఖీ చేయడం, కూలీలకు అవసరమైన తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం గ్రీన్‌నెట్ షెడ్లను ఏర్పాటు చేయడం తదితర పనులను పర్యవేక్షించాలి. వీటితో పాటు ప్రధానంగా గ్రామాల్లో సర్పంచ్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసి కూలీల సంఖ్య పెంచేలా శ్రద్ధ వహించాలి. కాగా ఉపాధి పనుల పర్యవేక్షణ పూర్తి బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంపై గ్రామాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో కూలీల సంఖ్య పెంపుతో పాటు పనులను పారదర్శకంగా, సమర్థవంతంగా చేపడుతారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర్వులు అందాయి
ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ పంచాయతీ కార్యదర్శులకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. వాటిపై ఇటీవల పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ప్రతీ కార్యదర్శి తప్పనిసరిగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను పెంచడంతో పాటు పనులు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలి.
– నర్సింగం, ఎంపీఓ, స్టేషన్‌ఘన్‌పూర్
కూలీల హాజరు నుంచి పనుల పర్యవేక్షణ వరకు..
కూలీల సంఖ్య పెరిగే అవకాశం
పారదర్శకంగా పనుల నిర్వహణ
ఆదేశాలు జారీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్


