హెచ్‌టీ సర్వీసులకు ‘సింగిల్‌ విండో’ | - | Sakshi
Sakshi News home page

హెచ్‌టీ సర్వీసులకు ‘సింగిల్‌ విండో’

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

జనగామ: జనగామ విద్యుత్‌ సర్కిల్‌లో హెచ్‌టీ విద్యుత్‌ సేవల మంజూరులో వేగం, పారదర్శకత పెంచేందుకు ‘సింగిల్‌ విండో’ విధానం అమలులోకి తీసుకొచ్చారు. 11 కేవీ, 33 కేవీతో పాటు అధిక ఓల్టేజ్‌ హెచ్‌టీ సర్వీసుల కోసం దరఖాస్తుల పరిశీలన, అనుమతుల ప్రక్రియలను మరింత సరళీకరించేందుకు కార్పొరేట్‌, సర్కిల్‌ స్థాయిలో ప్రత్యేక ‘హెచ్‌టీ మానిటరింగ్‌ సెల్‌’ను ఏర్పాటు చేశారు. ఈ సెల్‌ ద్వారా దరఖాస్తుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించి, సంబంధిత అధికారులకు బాధ్యతలు విభజించి, వినియోగదారులకు నిర్ణీత కాలంలో సేవలు అందేలా చర్యలు చేపట్టారు. కొత్త వ్యవస్థతో వినియోగదారులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఒకే వేదికలో అన్ని అనుమతులు, సేవల మంజూరు వేగంగా జరుగనుంది. హెచ్‌టీ సేవలపై ప్రజలకు మరింత సులభమైన, సమర్థమైన విధానాన్ని అమలు చేయడం లక్ష్యమని ఎస్‌ఈ తెలిపారు.

ఆన్‌లైన్‌ నమోదు–ట్రాకింగ్‌ విధానం

టీజీఐపాస్‌ పరిధిలోకి రాని హెచ్‌టీ దరఖాస్తుదారులు టీజీ ఎన్పీడీసీఎల్‌ అధికారిక పోర్టల్‌లో అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు పూర్తికాగానే ప్రత్యేక అప్లికేషన్‌ నెంబర్‌ (యూఐడీ) కేటాయించబడుతుంది. ఈ దరఖాస్తులు వెంటనే సంబంధిత సర్కిల్‌ కార్యాలయ డాష్‌బోర్డ్‌లో కనిపిస్తాయి. ఏడీఈ (కమర్షియల్‌) అధికారులు ఈ డాష్‌బోర్డ్‌ను ప్రతిరోజూ పర్యవేక్షిస్తారు.

పరిశీలన–మంజూరు ప్రక్రియ

దరఖాస్తు నమోదైన వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన, ఎస్టిమేట్ల కోసం సంబంధిత అధికారులకు పంపిస్తారు. సర్కిల్‌ ఏడీఈ (కమర్షియల్‌) స్వయంగా మౌలిక సదుపాయాల లొకేషన్‌ను క్షేత్రస్థాయి సిబ్బందితో పరిశీలిస్తారు. 33 కేవీ, అంతకు పైబడి సర్వీసులకు కార్పొరేట్‌ కార్యాలయ ఉన్నతాధికారుల అనుమతి అవసరం ఉంటుంది. అదే విధంగా 33 కేవీ దరఖాస్తుల ఫీజిబిలిటీ అనుమతులను సీఈ కమర్షియల్‌, ఆర్‌ఏసీ, టీజీ ట్రాన్స్‌కో హైదరాబాద్‌ కార్యాలయానికి ఆన్‌న్‌లైన్‌ ద్వారా పంపిస్తారు.

సమయపాలన–పారదర్శకత

దరఖాస్తులు ఫీజిబిలిటీ అనుకూలంగా ఉంటే రెండు రోజుల్లోపే పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. సాంకేతిక సమస్యల వల్ల సాధ్యంకాకపోతే దరఖాస్తుదారునికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా వెంటనే సమాచారం పంపిస్తారు. 33 కేవీ, ఆపై దరఖాస్తులు నిర్దేశిత సమయపాలన ప్రకారం పరిశీలిస్తారు. అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుతో సర్వీసులు మంజూరు చేస్తారు. ఈ సింగిల్‌ విండో వ్యవస్థ ప్రవేశ పెట్టడం ద్వారా హెచ్‌టీ సర్వీసుల మంజూరు మరింత వేగవంతం కాగా, వినియోగదారులకు పూర్తిస్థాయి పారదర్శకత కలుగనుంది.

వేగవంతం, పారదర్శకత..

హెచ్‌టీ 11 కేవీ, 33 కేవీతో పాటు అధిక ఓల్టేజ్‌ సేవల మంజూరును వేగవంతం చేసి పారదర్శకంగా అందించేందుకు సింగిల్‌ విండో విధానాన్ని ప్రారంభించాం. దరఖాస్తుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక హెచ్‌టీ మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేశాం. వినియోగదారులు ఆలస్యం లేకుండా సేవలు పొందడం మా ప్రధాన లక్ష్యం. సింగిల్‌ విండో విధానంతో ప్రతి చిన్న పనికి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచే తమ దరఖాస్తు స్థితిగతులను ఆన్‌లైన్‌ ద్వారా స్టేటస్‌ చేసుకోవచ్చు.

– సంపత్‌రెడ్డి, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్‌

11 కేవీ ఓల్టేజ్‌ దరఖాస్తులు

సర్కిల్‌ కార్యాలయంలోని ఏడీఈ (కమర్షియల్‌) అధికారి పర్యవేక్షిస్తారు.

33 కేవీ, ఆపై ఓల్టేజ్‌ దరఖాస్తులు

కార్పొరేట్‌ కార్యాలయంలోని ఏడీఈ (కమర్షియల్‌) పర్యవేక్షణలో ఉంటాయి.

విద్యుత్‌ వినియోగదారులకు

వేగవంతంగా సేవలు

దరఖాస్తుల పర్యవేక్షణకు

ప్రత్యేక హెచ్‌టీ మానిటరింగ్‌ సెల్‌

Advertisement
 
Advertisement
Advertisement