హన్మకొండ: ఆకాశంలో వేలాడుతున్న విద్యుత్ తీగలపై అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై యాజమాన్యం కనికరం చూపడం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు పదోన్నతి మీద పదోన్నతి తీసుకుంటూ.. జూనియర్ లైన్‌మెన్‌ల చిరుద్యోగుల పదోన్నతి హక్కును కాలరాయడంపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని టీజీ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లో జూనియర్ లైన్‌మన్‌లకు ఆ యాజమాన్యాలు ఏఎల్‌ఎంలుగా పదోన్నతి కల్పించాయి. కానీ, ట్రాన్స్‌కోలో కల్పించకుండా జూనియర్ లైన్‌మన్‌లను గోస పెడుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.
అన్నీ ఖాళీలే..
టీజీ ట్రాన్స్‌కోలో జేఎల్‌ఎం పోస్టులు 1,119 ఉన్నాయి. ఇందులో 892 పోస్టులు భర్తీ అయ్యాయి. అసిస్టెంట్ లైన్‌మన్ పోస్టులు 378 ఉండగా ఇక్కడ ఆరుగురు మాత్రమే ఉన్నారు. లైన్‌మన్ పోస్టులు 280 ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. 372 అసిస్టెంట్ లైన్‌మన్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని పదోన్నతి ద్వారా భర్తీ చేయకుండా జేఎల్‌ఎంల సహనానికి పరీక్ష పెడుతున్నారు. 24 గంటలు శ్రమిస్తూ వ్యవస్థను నిలబెడుతున్న తమపై ఇంత వివక్ష యాజమాన్యానికి తగదని మొత్తుకుంటున్నారు.
వయస్సు మీరుతున్నా..
జూనియర్ లైన్‌మన్ పోస్టులు నియమించే క్రమంలో అప్పటికే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆర్టిజన్‌లుగా పని చేస్తూ ఈ ఉద్యోగంలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. రిక్రూట్‌మెంట్ సమయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఆర్టిజన్ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ వెయిటేజీ ఇవ్వడంతో చాలాది జేఎల్‌ఎంలుగా ఎంపికయ్యారు. వీరు అప్పటికే 10 నుంచి 15 సంవత్సరాల సర్వీస్ చేసిన వారున్నారు. చాలామంది 50 ఏళ్ల వయస్సుకు వచ్చారు. వయస్సు మీరుతున్నా వీరంతా తమకు ఒక్క పదోన్నతి వచ్చిన చాలు అనే ఆశతో ఉన్నారు. కానీ, వీరి ఆశలను ట్రాన్స్ కో యాజమాన్యం నీరుగారుస్తోంది. ఇంజనీర్లు, అకౌంట్స్, హెచ్‌ఆర్‌డీ విభాగంలో అన్ని స్థాయి ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన యాజమాన్యం తమకు ఎందుకు కల్పించడం లేదని జూనియర్ లైన్‌మన్‌లు ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రాణాలను సైతం లెక్క చేయకుడా విధులు నిర్వహిస్తున్న జేఎల్‌ఎంలపై యాజమాన్యం తక్కువ చేసి చూడడం సమంజసం కాదని ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా జేఎల్‌ఎంలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ట్రాన్స్‌కో యాజమాన్యం తీరుపై విమర్శలు
ఏఎల్‌ఎంలుగా పదోన్నతి కల్పించడంలో జాప్యం
ప్రమాదకరంగా విధులు నిర్వర్తిస్తున్నా
కనికరం చూపని వైనం


