జనగామ రూరల్: 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి విక్రమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం తెలంగాణ ఈ–పాస్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తక్షణమే తమ పేర్లను నమోదు చేసుకుని ఉపకార వేతనాలను పొందాలని కోరారు.
నేడు మహిళా ఉద్యోగులకు
అవగాహన
జనగామ రూరల్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు మహిళా ఉద్యోగులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులు హాజరు కావాలని, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం –2013 (నిరోధం, నిషేధం, పరిహారం) గురించి అవగాహన ఉంటుందన్నారు.
వడదెబ్బ మృతుడి కుటుంబానికి
రూ.5లక్షల అందజేత
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని రంగరాయగూడెం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో సోమవారం మృతిచెందిన రైతు నెలమంచ ఇలేందర్‌రెడ్డి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో కలెక్టర్ నిధుల నుంచి మంగళవారం రూ.5లక్షలు అందించారు. ఈ చెక్కును స్థానిక తహసీల్దార్ స్వప్న చేతులమీదుగా మృతుడి భార్యకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, ఆర్‌ఐలు శ్రీకాంత్, సతీష్, నాయకులు తోట వెంకన్న, నెలమంచ అజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్‌ను కలిసిన
మహిళా కమిషన్ సభ్యురాలు
పాలకుర్తి టౌన్: రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన చిట్యాల శ్వేత మంగళవారం హైదరాబాద్‌లో గవర్నర్ నివాసంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తానని శ్వేత పేర్కొన్నారు. మహిళా కమిషన్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహంచాలని ఈసందర్భంగా గవర్నర్ ఆమెకు సూచించారు.


