జనగామ: రైతు తన పంటను అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నా, కుప్పలపై ప్రాణాలు వదులుతున్న రైతుల దుస్థితిని పట్టించుకునే మనసు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ‘రైతుగోస–బీజేపీ భరోసా’ బస్సు యాత్ర మంగళవారం జిల్లాకు చేరుకుంది. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పైడి రాకేష్‌రెడ్డి, పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, దన్‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ సీహెచ్ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌తో కలిసి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత బృందం జనగామ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డు ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించారు. ధాన్యం రాశుల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు.. సెంటర్లలో బస్తా కాంటా 41.600 కిలోల చొప్పున వేస్తుండగా, మిల్లుకు వెళ్లిన తర్వాత మరో రెండు కిలోలు కటింగ్ చేస్తున్నారని జనగామకు చెందిన మహిళా రైతు మాలోతు రాణి బీజేపీ ఫ్లోర్ లీడర్‌కు చెబుతూ ఆవేదనకు గురయ్యారు. అనంతరం బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో కిలోమీటర్ల కొద్దీ ధాన్యం కుప్పలతో రైతులు 45 రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతల నడుమ కాపలా కాస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. లక్ష టన్నుల ధాన్యం రోడ్లపైనే ఉండిపోయిందని, ఈ పరిస్థితి ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైన సమస్యలు ఉంటే, జనగామ జిల్లాలో మరో రకంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.
బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి
జిల్లాలో బీజేపీ బస్సు యాత్ర..
ఐకేపీ, మెప్మా సెంటర్లను సందర్శించిన ప్రజాప్రతినిధులు


