ధాన్యం తరలింపులో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలింపులో వేగం పెంచాలి

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌

పాలకుర్తి టౌన్‌: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులో వేగం పెంచాలని అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌ ఆదేశించారు. మంగళవారం మండలంలోని తొర్రూరు, పాలకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రైతుకు గన్నీ బ్యాగులు ఇవ్వాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా రఘనాథపల్లి వద్ద ప్రభుత్వ గోదాంల్లోకి ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలకుర్తిలో వ్యవసాయ మార్కెట్‌ గోదాంనకు కూడా ధాన్యాన్ని తరలించాలని అధికారులను సూచించారు. తహసీల్దార్‌ సరస్వతి, పీఏసీఎస్‌ కార్యదర్శి రణధీర్‌ పాల్గొన్నారు.

స్నేహితుడికి సాయం

బచ్చన్నపేట: మండలంలోని ఆలింపూర్‌ గ్రామానికి చెందిన తేలుకంటి మురళికి బైపాస్‌ సర్జరీ అయింది. కాగా, బచ్చన్నపేట హైస్కూల్‌లో మురళితో కలసి 1984–85 బ్యాచ్‌ టెన్త్‌ చదివిన పూర్వవిద్యార్థులు మంగళవారం రూ.70వేల సాయం అందజేశారు. మిత్రులు పెరుమాండ్ల యాదగిరి, తేలుకంటి వేణుగోపాల్‌, తమ్మడి మహేందర్‌ పాల్గొన్నారు.

వైభవంగా అష్టదళ

పాదపద్మారాధన పూజ

చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ వైభవంగా స్వామి వారికి విశ్వక్సేన ఆరాధన, అష్టోత్తర శత సువర్ణ పుష్పాదులతో అష్టదళ పాదపద్మారాధన పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు సువర్ణ పుష్పాలను చూపించారు. ఆలయ చైర్మన్‌ శ్రీధర్‌రావు, ఈఓ లక్ష్మీప్రసన్న, జూనియర్‌ అసిస్టెంట్‌ కుర్రెంల మోహన్‌, గణగోని రమేష్‌, గొల్లపల్లి వాసు, దారం రాజన్‌బాబు, కాండూరి రంగరాజు భక్తులు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు బైకు దగ్ధం

బచ్చన్నపేట: ప్రమాదవశాత్తు బైక్‌ నుంచి మంటలు వచ్చి దగ్ధమైంది. ఈ ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ యువకుడు తన బైక్‌పై జనగామ నుంచి బచ్చన్నపేటకు మధ్యాహ్నం వచ్చి బస్టాండ్‌ వద్ద చాయ్‌ తాగడానికి బైక్‌ను పార్కింగ్‌ చేసి హోటల్‌కు వెళ్లాడు. ఎండ వేడికి బైక్‌ పెట్రోల్‌ ట్యాంకు అంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టు పక్కల వారు నీళ్లు పోసి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో బైక్‌ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో బైక్‌ చుట్టూ ఉన్న ఇతర వాహనాలను పక్కకు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వాహనాల్లో పెట్రోల్‌ను ఫుల్‌గా నింపకూడదని, వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

పరామర్శ

బచ్చన్నపేట: మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్‌ నల్ల సిద్దినర్సమ్మ మల్లయ్య కుమారుడు వెంకటేష్‌ రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందాడు. కాగా, మంగళవారం పలువురు నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృత దేహంపై పూల మాల వేసి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్‌కుమార్‌గౌడ్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు రాములు తదితరులు ఉన్నారు.

నియామకం

జనగామ రూరల్‌: భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మండలంలోని శామీర్‌పేట గ్రామానికి చెందిన చింతకింది సంతోష్‌ మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీలో అధికార ప్రతినిధిగా చురుగ్గా పనిచేస్తుండడంతో మరొకసారి అవకాశం ఇచ్చినట్టు గణేష్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతోష్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement