జఫర్‌గఢ్: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో తెచ్చేందుకు గత ప్రభుత్వం ఎంతో అర్భాటంగా చేపట్టిన హెల్త్ సబ్‌సెంటర్లు నిధుల కొరతతో ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అందుబాటులోకి రావడం లేదు. దీంతో వైద్య సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామంలో గత ప్రభుత్వ హయంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) స్కీం ద్వారా రూ.20 లక్షల నిధులతో హెల్త్ సబ్ సెంటర్‌ను మంజూరు చేసింది. ఆ నిధులతో 2024 సంవత్సరంలో గ్రామంలోని ఉప్పుగల్లు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో భవన నిర్మాణ పనులను చేపట్టారు. దీంతో సదరు కాంట్రాక్టర్ భవన నిర్మాణ పనులు పూర్తిచేశారు. కానీ, ఇంకా అందులో ఫ్లోరింగ్, ప్లబింగ్, నీటి సౌకర్యం, విద్యుత్, తలుపులు, కిటికీలు తదితర పనులు చేపట్టాల్సి ఉండగా నిధుల కొరత మూలంగా ఆ పనులు నిలిచిపోయాయి. భవనం పూర్తయి నెలలు గడుస్తున్నప్పటీకి మిగితా పనులు కాకపోవడంతో హెల్త్ సెంటర్ భవనం అలంకారప్రాయంగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కాగా, భవనంలో మిగతా పనులు చేపట్టేందుకు మరో రూ.3 లక్షలు అవసరం కానుండడంతో దీనికి సంబంధించిన ప్రతిప్రాదనలు సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించిన్నప్పటికీ మంజూరుకు నోచుకోలేదు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మిగతా పనులు పూర్తి చేయించి హెల్త్ సబ్ సెంటర్ ద్వారా వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తమ్మడపల్లి (ఐ)లో నూతనంగా నిర్మించిన హెల్త్ సెంటర్ భవనంలో వైద్య సేవలను వెంటనే ప్రారంభించాలి. భవనం పూర్తయి అలంకారప్రాయంగానే ఉంటోంది. ఇప్పటికై నా మిగతా పనులు చేపట్టి వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించాలి.
– ఆగబోయిన రాధిక, తమ్మడపల్లి
హెల్త్ సెంటర్ భవనం పూర్తయి నెలలు కావస్తున్నా ప్రారంభించడం లేదు. నీటి వసతి, కరెంటు, ఫర్నీచర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసే విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలి.
– రడపాక సునీల్, తమ్మడపల్లి
భవనం పూర్తయినా నిధులులేక
మిగతా పనులకు నోచుకోని పరిస్థితి
తమ్మడపల్లిలో అందుబాటులోకి రాని వైద్య సేవలు


