వరి కొయ్యలకు నిప్పు.. పచ్చనిచెట్లకు శాపం | - | Sakshi
Sakshi News home page

వరి కొయ్యలకు నిప్పు.. పచ్చనిచెట్లకు శాపం

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి శివారులోని గుప్త ప్రసన్న భక్త ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఓ రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పంటించగా మంటలు ఒక్కసారిగా వ్యాపించి సమీపంలోని పచ్చని చెట్లను చుట్టుముట్టాయి. దీంతో ఆలయ సమీపంలోని వివిధ రకాల వేలాది చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. రహదారి పక్కన హరితహారంలో భాగంగా పెంచిన చెట్లు కాలిపోయాయి. అంతేకాక ఆలయంలోని పామాయిల్‌ తోటలోని చెట్లు, ఆరువేల సర్వి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైరింజన్‌ వచ్చే సరికి అప్పటికై వేలాది చెట్లు కాలిపోయాయి. మంటలు వ్యాప్తి చెందకుండా నిలువరించారు. అగ్ని ప్రమాదంలో రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. చెట్ల దగ్ధానికి కారణమైన వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఆలయ నిర్వాహకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయ్యవారిగూడెంలో అగ్నిప్రమాదం

అయ్యవారిగూడెంలో విద్యుత్‌ నిప్పురవ్వలతో మంగళవారం వ్యాపించిన మంటలతో గ్రామానికి చెందిన పారునంది యాదగిరికి చెందిన పశువుల కొట్టం, గడ్డి కట్టల వాము కాలి పూర్తిగా దగ్ధమయ్యాయి. మధ్యాహ్నం ఎల్‌టీ లైన్‌ లూజుగా ఉండటంతో గాలి దుమారానికి తీగలు ఆనుకొని నిప్పురవ్వలు చెలరేగి నేలపై పడటంతో మంటలు లేచాయి. గాలి తాకిడికి గడ్డికట్టలతో ఉన్న వాముకు శరవేగంగా చుట్టుముట్టాయి. పక్కనే ఉన్న పశువుల కొట్టంకు అంటుకొని దగ్ధమైంది. ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వగా అందుబాటులో లేక పోవడంతో నష్టం జరిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు యాదగిరి కోరారు.

లింగాలఘణపురంలో..

లింగాలఘణపురం: మండల కేంద్రంలో మంగళవారం ప్రమాదశాత్తు మంటలు చెలరేగి పొలాల నుంచి ఇళ్ల సమీపం వద్దకు చేరడంతో సర్పంచ్‌ లావణ్యరాజు సహకారంతో వాటర్‌ ట్యాంక్‌లో నీళ్లు తీసుకొచ్చి మంటలను ఆర్పారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్‌ ఘటనా స్థలికి చేరుకొని పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి గ్రామస్తుల సహకారంతో మంటలను ఆర్పారు.

అశ్వరావుపల్లి శివారులో అగ్నికీలల్లో

వేలాది చెట్లు దగ్ధం

Advertisement
 
Advertisement
Advertisement