ఆగుతూ.. సాగుతూ | - | Sakshi
Sakshi News home page

ఆగుతూ.. సాగుతూ

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు ఎప్పుడు పూర్తయ్యేనో?

పాలకుర్తి టౌన్‌: గోదావరి జలాలతో పాలకుర్తి నియోజకవర్గ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఇసుక, డీజిల్‌ కొరతతో కొద్ది రోజులగా పనులు నిలిచిపోయాయి. పాలకుర్తి నియోజకవర్గ రైతుల చిరకాల కోరికై న చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులు 17 ఏళ్లుగా నిధుల కొరత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో సకాలంలో పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుర్తి, చెన్నూరు ఊర చెరువును బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లుగా మార్చేందుకు అప్పటి ప్రభుత్వం 2009 ఫిబ్రవరి 27న నాటి నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య శంకుస్థాపన చేశారు. చెన్నూరులో 2015లో అప్పటి నీటిపారుదల శాఖ మంద్ర హరీశ్‌ రావు పనులు ప్రారంభించారు. పాలకుర్తి రిజ ర్వాయర్‌ 0.25 టీఎంసీ, చెన్నూరు రిజర్వాయర్‌ 058 టీఎంసీ సామర్థ్యంతో పనులు చేపట్టారు. వీటి కోసం మొదటి విడత రూ.320 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆ తర్వాత రూ.370 కోట్లకు పెంచింది. పనులు జాప్యం కావడంతో పాటు రీటెండర్లు పిలవడంతో ఆ మొత్తం రూ.1,010 కోట్లకు చేరుకుంది.

రెండు జిల్లాలకు ప్రయోజనం..

పాలకుర్తి రిజర్వాయర్‌ ఆయకట్టు 7,515 ఎకరాలు కాగా, చెన్నూరు రిజర్వాయర్‌ ఆయకట్టు 25,165 ఎకరాలు. ఈ రిజర్వాయర్లు పూర్తయితే జనగామ, సూర్యాపేట జిల్లాలకు సాగునీరు అందనుంది.

మరో 670 ఎకరాల భూమి సేకరణ..

పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల కోసం 2,961 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 2,289 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మరో 670 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం పాలకుర్తి రిజర్వాయర్‌ కట్ట ఎత్తు పెంపుదల పనులు, గ్రానైట్‌ రాయి బ్లాస్టింగ్‌ పనులు కొనసాగుతున్నాయి, చెన్నూరు రిజర్వాయర్‌ పనులు నత్తనడకన నడుస్తున్నాయి.

మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్‌ సమీక్షించినా..

స్థానిక ఎమ్మెల్యే యశ్వసినిరెడ్డి గతంలో వరంగల్‌, హైదరాబాద్‌, పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో రిజర్వాయర్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఇటీవల కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్‌.కాంతారావు పాలకుర్తి రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాలకుర్తి రిజర్వాయర్‌ పనులు కొంత మేర జరగాయి. రిజర్వాయర్‌ పనుల్లో భాగంగా కట్ట కింద కిలోమీటర్లు దూరం తవ్వారు. చెరువు కట్ట నుంచి ఆర్‌ఆండ్‌బీ రోడ్డు , స్టేషన్‌ఘన్‌పూర్‌ రోడ్డు వరకు పనులు కొంత వరకు వదిలేశారు. అవి ప్రాథమిక దశలోనే ఉండడంతో ఇప్పట్లో పనులు పూర్తయ్యేనా? అని స్థానిక రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇసుక, డీజిల్‌ కొరతతో పాలకుర్తి రిజర్వాయర్‌ పనులు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు.

రూ.1,010 కోట్ల అంచనా..రీడిజైన్‌తో పెరిగిన ఎస్టిమేషన్‌

ప్రస్తుతం ఇసుక, డీజిల్‌ కొరతతో ఆగిన పనులు

కాంట్రాక్టర్లు మారినా అంతులేని జాప్యం

ప్రాజెక్టులు పూర్తయితే 32,680 ఎకరాలు సాగులోకి..

పనులు పూర్తి చేయిస్తాం..

రిజర్వాయర్ల పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తా. పెండింగ్‌ పనులపై సీఎం రేవంత్‌రెడ్డికి నివేదించా. నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. పనుల పురోగతిపై పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించా. పాలకుర్తి మండల ప్రజల ఆకాంక్ష మేరకు చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకువస్తా. నియోజకవర్గ రైతుల కళ్లలో ఆనందం చూడడమే నా లక్ష్యం.

– మామిడాల యశ్వసినిరెడ్డి,

ఎమ్మెల్యే, పాలకుర్తి

Advertisement
 
Advertisement
Advertisement