అర్జీలు @ 550 | - | Sakshi
Sakshi News home page

అర్జీలు @ 550

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో రికార్డు

కలెక్టర్‌ను కలిస్తే పరిష్కారం ఖాయమని పోటెత్తుతున్న ప్రజలు

ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధిక వినతులు

జనగామ: ప్రజా సమస్యల పరిష్కార విధానంలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కొత్త పాలనా ప్రమాణాలు సృష్టిస్తున్నారు. ప్రజల అభ్యర్థనలపై స్పందన, వెంటనే చర్యలు, పారదర్శక వ్యవస్థ ఈ మూడు ప్రత్యేకతలతో కలెక్టర్‌పై ప్రజల్లో విశ్వాసం గణనీయంగా పెరిగింది. ఇదే నమ్మకానికి నిదర్శనంగా సోమవారం జరిగిన కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో జిల్లాలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో 550 దరఖాస్తులు స్వీకరించడం గమనార్హం. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా గ్రీవెన్స్‌లో ఒక్కో అర్జీని శ్రద్ధగా పరిశీలించారు. సమస్య వివరాలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, జీవనోపాధి, భూ సంబంధిత సమస్యలు, తదితర అంశాలపై ప్రజలు పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పించగా కలెక్టర్‌ ప్రతీ దరఖాస్తును వ్యక్తిగతంగా పరిశీలించారు. గ్రీవెన్స్‌లో జెడ్పీ సీఈఓ రంగారావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అర్జీల్లో కొన్ని ఇలా..

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి గూడు కల్పించాలని జనగామ మండలం అడవికేశ్వాపూర్‌కు చెందిన యానాల అనసూయ, ఎర్రగొల్లపహాడ్‌కు చెందిన గంపల లక్ష్మి, బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్లకు చెందిన ఎం.రమాదేవి, లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన రేసు నరేందర్‌, పట్టణంలోని 11వ వార్డుకు చెందిన చిట్టిమల్ల మౌనిక విజ్ఞప్తి చేశారు.

● తన కాలు విరిగిందని, కాలి వేళ్లను తొలగించారని, పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నానని పింఛన్‌ ఇప్పించాలని పట్టణంలోని ధర్మకంచకు చెందిన కె.రవీందర్‌ వినతి అందించారు. భార్య, కొడుకు, కూతురు కూలికి వెళ్తేనే కుటుంబం గడుస్తోందని వాపోయారు.

● తమకు ఇల్లు లేదని, ఇందిరమ్మ పథకంలో అవకాశం కల్పించాలని కోరుతూ జనగామ మండలం అడవికేశ్వాపూర్‌, నర్మెట మండలాలకు చెందిన మహిళలు అనసూర్య, బండ మైసమ్మ, పి.విమల, పి.కొమరమ్మ, పోచమ్మ, రాజమణి, ఇంద్ర, రాజమ్మ కలెక్టర్‌కు వినతి చేశారు.

● ఐకేపీ సెంటర్‌లో 538 బస్తాల ధాన్యం అమ్ముకున్నానని, ధాన్యాన్ని మిల్లులో అన్‌లోడ్‌ చేస్తే, డబ్బులు ఇచ్చే సమయంలో 17 బస్తాలు కటింగ్‌ వేసి ఇచ్చారని బచ్చన్నపేట మండలం అలీంపూర్‌ మేక అనిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందేంటని అడిగితే సెంటర్‌ నిర్వాహకులు సమాధానం చెప్పడం లేదని, రూ.17వేల వరకు నష్టపోతున్నానని, న్యాయం చేయాలని వినతి పత్రం అందించారు.

● ‘5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేశా.. మొదటి విడత కోత సమయంలో 280 బస్తాల దిగుబడి వస్తే, ఐకేపీ సెంటర్‌లో అమ్ముకున్నా. 41 కిలోల 2వందల గ్రాములు తూకం వేశారు. నిర్వాహకులు మిల్లుకు పంపించిన తర్వాత 8 బస్తాలు కటింగ్‌ చేసి డబ్బులు ఇచ్చారు. ఎందుకు కటింగ్‌ చేశారని అడిగా.. ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఈ విషయమై ఈ నెల 23వ తేదీన తన ధాన్యం కాల్చుకుంటానని చెప్పడంతో పోలీసులు వచ్చి సముదాయించారు. పోలీస్‌ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశా’నని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్‌ గ్రామానికి చెందిన రైతు పామరుపల్లి బాలయ్య వాపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement