విద్యారణ్యపురి: నాలుగేళ్ల క్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఆయా కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించగా.. అప్పట్లో ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు కాలేదు. దీంతో ఆతర్వాత మహబూబాబాద్, ములుగులోని ఈరెండు బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలను అదే పేర్లతో కాజీపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఐదేళ్ల లా కోర్సు నడుస్తున్న భవనంలోకి మార్చారు. రెండేళ్లపాటు అరకొర వసతులతో కళాశాలలను కొనసాగించగా.. గతేడాది తమకు వసతులు సరిపోవట్లేదని బీసీ గురుకుల లా విద్యార్థులు ఆందోళన చేశారు. చివరికి మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట కార్యదర్శి సైదులు ఆదేశాలతో జనగామ జిల్లాలోని పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు 2025 డిసెంబర్ 22న షిఫ్ట్ చేశారు.
మళ్లీ వరంగల్‌కే మార్చాలని డిమాండ్
కళాశాలలను మళ్లీ వరంగల్‌కే మార్చాలనే డిమాండ్ వ్యక్తం కావడంతో గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి ఈఏడాది మార్చిలో ఆయా మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలను వరంగల్ రంగశాయిపేటలోని నాయిడు పెట్రోల్ బంక్ సమీపంలోని అద్దె భవనంలోకి మార్చాలని ఆదేశించారు. వివిధ కారణాలతో షిఫ్టింగ్‌కు కొంత ఆలస్యమై చివరికి సోమవారం పెంబర్తి నుంచి వరంగల్‌కు మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలు షిఫ్టింగ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఆరెండు కళాశాలలు కలిపి డిగ్రీ సెకండియర్, ఫైనల్ ఇయర్‌లో 215 మంది విద్యార్థినులు చదువుతున్నారు. జూన్ ఒకటి నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
బీసీ గురుకుల మహిళా డిగ్రీ
కళాశాలలు షిఫ్టింగ్
మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించిన గురుకుల డిగ్రీ కళాశాల వరంగల్‌లోని రంగశాయిపేట
అద్దె భవనంలోకి..
అడ్మిషన్ల ప్రక్రియ షురూ..
వరంగల్ రంగశాయిపేటలోని అద్దె భవనంలోనికి మార్చిన మహబూబాబాద్, ములుగు బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలల్లో (2026–27) విద్యాసంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు, దరఖాస్తులు చేసుకోవాలని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్‌వీఎన్ చారి సోమవారం తెలిపారు. బీఏ హెచ్‌ఈపీ, బీకాం (సీఏ), బీఎస్సీ బీజెడ్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్‌డీఎస్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు నేరుగా పొందవచ్చని, పూర్తి వివరాలకు 98666 10429, 96768 17038 సంప్రదింవచ్చని సూచించారు.


