కేయూ క్యాంపస్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష–2026 ఆదివారం రెండు సెషన్లలో ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని ట్రైసిటీలో ఏర్పాటు చేసిన పది పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన ఆరుగురు అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షకు మొత్తం అభ్యర్థులు 4,075 మంది అభ్యర్థులగాను 2,762 మంది (67.78 శాతం) హాజరయ్యారు. 1,313 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రెండో సెషన్‌ను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించారు. రెండో సెషన్‌లో 2,749 మంది అభ్యర్థులు(67.49 శాతం) హాజరుకాగా 1,326 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. యూపీఎస్సీ సెంట్రల్ ఇన్‌స్పెక్షన్ అధికారి శుభం గౌడ్, అబ్జర్వర్ టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


