సన్నరకం..సాగు లాభం! | - | Sakshi
Sakshi News home page

సన్నరకం..సాగు లాభం!

May 25 2026 3:16 AM | Updated on May 25 2026 3:16 AM

జనగామ: జిల్లాలో ఏటా యాసంగి, వానాకాలంలో వరుసగా దొడ్డు రకం వరి సాగు చేస్తున్నారు. ఇది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఒకే రకం ధాన్యం సాగు చేయడం వల్ల మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిపోవడం, దిగుబడి పెరిగినా అమ్మకాల్లో ఇబ్బందులు రావడం, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి పడిపోవడం వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కేవలం ఒకే రకం ధాన్యం ఉత్పత్తి కావడంతో ప్రభుత్వ స్థాయిలో కూడా కొనుగోలు, నిల్వ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో గోదాంల సంఖ్య పరిమితంగా ఉండడంతో అధిక ధాన్యం నిల్వ చేయడం కష్టసాధ్యమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు పంటల మార్పు అవసరాన్ని గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు.

దేశ, విదేశాల్లో భారీ డిమాండ్‌

దొడ్డు రకంతో పోలిస్తే సన్నరకం ధాన్యానికి మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉండడంతో సన్నధాన్యం రైతులకు లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ సన్నధాన్యం ప్రమోషన్‌న్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్లు అభివృద్ధి చేసిన అధిక దిగుబడి సన్నరకం విత్తనాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. జిల్లాలో కూడా వీటి పంపిణీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. రీసెర్చ్‌ సెంటర్లలో వ్యవసాయ శాస్త్రవేత్తలు తయారుచేసిన సన్నరకం సీడ్‌తో అధిక దిగుబడి, మంచి మార్కెట్‌ విలువ కలిగిన రకాలే కావడంతో రైతులు సాగుచేస్తే అమ్మకాల సమస్యలు తగ్గడంతో పాటు మంచి లాభాలు వస్తాయని వ్యవసాయ శాఖ వెల్లడిస్తోంది. ఈ విత్తనాలు జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాలతో పాటు అగ్రికల్చర్‌ యూనివర్సిటీలు నిర్వహిస్తున్న విత్తన మేళాల్లో దొరుకుతాయి. మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి కూడా సీడ్‌ లభ్యతపై సమాచారం పొందవచ్చు.

నూనెగింజలు–పప్పు దినుసులు

జిల్లాలో నూనె గింజలు, పప్పు దినుసులు వంటి ప్రత్యామ్నాయ పంటలపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ పంటల సాగు ప్రణాళికను ఖరారు చేసి, క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

జిల్లాలో విస్తీర్ణం

జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ప్రతీ సంవత్సరం వానా కాలంలో రెండు లక్షల ఎకరాలు, యాసంగిలో రెండు లక్షల 20 వేలు ఎకరాల్లో వరి సాగవుతోంది. అయితే ఇందులో సన్న రకం వరిసాగు 10 శాతం కూడా లేకపోవడం జిల్లా వ్యవసాయంలో ఉన్న ప్రధాన సమస్యగా అధికారులు పేర్కొంటున్నారు. సన్న రకం సాగు పెరిగితే రైతులకు లాభాలు పెరగడంతో పాటు మార్కెటింగ్‌ సమస్యలు తగ్గుతాయని, భవిష్య త్తులో ధాన్యం ఎగుమతులకు కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు పేర్కొన్నారు.

రీసెర్చ్‌ సెంటర్లు ఇవే

రాష్ట్రంలోని వ్యవసాయ రీసెర్చ్‌ సెంటర్‌, అగ్రికల్చ ర్‌ యూనివర్సిటీల్లో వానాకాలానికి అనువైన సన్నరకం వరివిత్తనాలను పెద్దఎత్తున తయారు చేశారు. ప్రస్తుతం రాజేంద్రనగర్‌ పీజేటీఎస్‌ఏయూ, వరంగల్‌ ఏఆర్‌ఎస్‌, జగిత్యాల ఏఆర్‌ఎస్‌, భూపాలపల్లి ఏఆర్‌ఎస్‌ వంటి కేంద్రాల్లో సీడ్‌ మేళాలు జరుగుతున్నాయి. ఈ మేళాల్లో ఆర్‌ఎన్‌ఆర్‌, కేఎన్‌ఎం, బీపీటీ వంటి ఆయా రకాలకు సంబంధించి అధిక దిగుబడి సన్నరకం విత్తనాలు రైతులకు నేరుగా అందించనున్నారు. రైతులు సమీప ప్రాంతాల్లోని ఈ కేంద్రాల్లో విత్తనాలు కొనుగోలు చేసుకోవచ్చు.

దొడ్డు రకం ధాన్యం కంటే మేలంటున్న అధికారులు

సన్నరకం వరిసాగు పెంపుపై

వ్యవసాయ శాఖ దృష్టి

వానాకాలంలో సాగు చేయాలని

రైతులకు సూచన

సరికొత్త సన్నరకాల విత్తనాలపై

అవగాహన

సన్నరకం విత్తనాల వివరాలు

రకం రోజులు

ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 125

ఆర్‌ఎన్‌ఆర్‌ 10754 120

కేఎన్‌ఎం 1638 125

బీపీటీ 5204 150

ఆర్‌ఎన్‌ఆర్‌ 11718 140

కేఎన్‌ఎం 7715 115

Advertisement
 
Advertisement
Advertisement