అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి అందించేందుకు ఇంటర్మీడియట్ విద్యను అందించటానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘కార్పొరేట్ విద్య పథకం’ కింద ఉచిత ప్రవేశాలు కల్పిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికిగాను కార్పొరేట్ ఇంటర్ కళాశాలల్లో ప్రవేశం పొందటానికి ఈ నెల 20 నుంచి వచ్చే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూన్ 5 తుదిగడువుగా ఉంది. పోటీ పరీక్షలకు కార్పొరేట్ కళాశాలల్లో శిక్షణతో పాటు నూతన విద్య మార్పులకు అనుగుణంగా సాంకేతిక విద్య అందనుంది. గతేడాది జిల్లాలో 6,443 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 6,292 మంది ఉత్తీర్ణులయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతిభ ఉన్న వారిని జూన్ 10న జిల్లాల వారీగా ఎంపిక చేయనున్నారు. 12న ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ఈ పథకం ద్వారా ఎంపికై న విద్యార్థులకు రూ.35 వేల చొప్పున ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. పాకెట్ మనీగా ఏడాదికి రూ.3 వేల చొప్పున విద్యార్థులకు అందిస్తుంది. ఉచిత వసతి కల్పించడమే కాకుండా మెరుగైన విద్యా బోధన అందుతుంది.
అర్హతలు..
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, నవోదయ, మోడల్ స్కూల్స్, గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదవి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు లక్షలు ఉండాలి. బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు 3లక్షలు మించకూడదు. కుల, ఆదాయ ధ్రువపత్రాలు, 4–10వ తరగతివరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మెమో, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, దివ్యాంగులు అయితే సదరం సంబందిత ధ్రువ పత్రాలు జతపర్చాల్సి ఉంటుంది. పదో తరగతిలో 400 పైగా మార్కులు వచ్చి ఉండాలి. లేదా జీపీఏ 7.0 సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
ప్రతిభ ఉన్న విద్యార్థులు మంచి అవకాశం
జూన్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ
ప్రభుత్వం ఉచితంగా ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు www. telangana.epass.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు గడువులోగా చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేట్ కళాశాలలోనైనా ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సందీప్‌కుమార్ ఝా, కలెక్టర్


