● వీసీలో ఉప ముఖ్యమంత్రి
మల్లు భట్టి విక్రమార్క
జనగామ రూరల్: పంట అవశేషాల దహనంపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదివారం ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ పౌరసరఫరాల సంస్థ కార్యాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలపై వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పంట అవశేషాలపై ప్రతీ గ్రామంలో రాబోయే 15 నుంచి 30 రోజుల పాటు ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవగాహన కార్యక్రమాల అనంతరం కూడా పంట అవశేషాలను కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనల మేరకు శాఖల వారీగా వివిధ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ఈ నెల 25న జిల్లాలో మంజూరైన 211 వీఓ బిల్డింగ్‌ల మార్కింగ్ పూర్తిచేయాలని ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి, డీ ఎం సీఎస్ హతీరామ్, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, డీఎంఓ రామకృష్ణ, డీఏఓ అంబికా సోనీ పాల్గొన్నారు.


