బీఆర్‌ఎస్‌ సభ్యత్వ కార్యాచరణ! | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సభ్యత్వ కార్యాచరణ!

May 22 2026 4:28 AM | Updated on May 22 2026 4:28 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు డిజిటల్‌ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్‌లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ల మాజీ చైర్మన్‌లు, సీనియర్‌లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రతీ నియోజకవర్గంలో డిజిటల్‌ సభ్యత్వ నమోదు శిబిరాలు, ఇంటింటి ప్రచారం, సోషల్‌ మీడియా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఇన్‌చార్జ్‌లకు సూచించినట్లు సమాచారం. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, రాబోయే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కేడర్‌ను సిద్ధం చేసే దిశగా ఇది కీలక అడుగుగా పార్టీ నేతలు భావిస్తున్నారు.

త్వరలోనే యాప్‌.. డిజిటల్‌ ప్ల్లాట్‌ఫామ్‌..

ఎమ్మెల్యే, సీనియర్‌ల సమన్వయంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ సభ్యత్వ సేకరణ జనగామ ఇన్‌చార్జ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ తెలిపారు. కాగా ప్రత్యేక యాప్‌, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా డిజిటల్‌ సభ్యత్వ నమోదు వేగవంతం, బూత్‌ స్థాయి కమిటీల బలోపేతం, యువత, మహిళలు, రైతుల చేరికపై ఫోకస్‌, గ్రామస్థాయిలో పార్టీలో చైతన్యం పెంపు, రాబోయే ఎన్నికల దృష్ట్యా కేడర్‌ యాక్టివేషన్‌ అన్న ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీటిపైనే తమ ఫోకస్‌ ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఇదివరకే ప్రకటించారు.

పల్లా రాజేశ్వర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతల కీలకభేటీ..

హనుమకొండలోని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఇంట్లో గురువారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుల కీలక భేటి జరిగింది. సమావేశంలో హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఆరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్‌, నియోజక వర్గ ఇన్‌చార్జులు బండ శ్రీని వాస్‌, డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల దుస్థితి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జిల్లా పార్టీ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతీ కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలని హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల ఇన్‌చార్జ్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతీ బూత్‌లో ఇద్దరిని గుర్తించి వారికి సభ్యత్వ నమోదు ప్రక్రియపై శిక్షణ ఇస్తామని తెలిపారు. కేంద్రం జూన్‌ 25 నుంచి చేపట్టనున్న ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమంపై నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హుల ఓట్లు తొలగిపోకూడదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేతలు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్‌చార్జ్‌లు

నియమించిన అధినేత కేసీఆర్‌..

డిజిటల్‌ డ్రైవ్‌కు గ్రీన్‌సిగ్నల్‌..

బూత్‌స్థాయినుంచి కేడర్‌

యాక్టివేషన్‌కు ప్లాన్‌

యువత, మహిళలు, రైతుల చేరికపై దృష్టి..

త్వరలో యాప్‌, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌

హనుమకొండలోని పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

ఇంట్లో భేటీ అయిన బీఆర్‌ఎస్‌ నేతలు

సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌లు వీరే..

సభ్యత్వ నమోదు పర్యవేక్షణకు పార్టీ అధినేత కేసీఆర్‌ నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జ్‌ను నియమించారు. జనగామకు బండ శ్రీనివాస్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌కు నాగుర్ల వెంకన్న, పాలకుర్తికి డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌, డోర్నకల్‌ (ఎస్టీ)కి మాజీ ఎంపీ మాలోత్‌ కవితలు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా మహబూబాబాద్‌ (ఎస్టీ)కి వై. సతీష్‌ రెడ్డి, నర్సంపేటకు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పరకాలకు ఎస్‌.సమ్మారావు, వరంగల్‌ పశ్చిమకు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, వరంగల్‌ తూర్పునకు మర్రి యాదవరెడ్డి, వర్ధన్నపేట (ఎస్సీ)కు మసూద్‌, భూపాలపల్లికి రామస్వామి నాయక్‌, ములుగు (ఎస్టీ)కి గండ్ర జ్యోతిలను నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement