● ప్రభుత్వ ధరకే విత్తనాలు, ఎరువులు అమ్మాలి
● వానాకాలం–2026 సన్నాహక సమావేశంలో కలెక్టర్
జనగామ: జిల్లాలో అనుమతి లేని, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన వానాకాలం–2026 సన్నాహక సమావేశంలో వ్యవసాయ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో కలెక్టర్ పాల్గొని కీలక సూచనలు జారీ చేశారు. ప్రభుత్వం, కంపెనీలు నిర్ణయించిన ధరలకే విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని ఆదేశించారు. తెల్ల పేపర్‌పై అమ్మకాలు పూర్తిగా నిషేధమని, ఒరిజినల్ బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని, బిల్లుపై డీలర్, రైతు ఇద్దరి సంతకాలు ఉండాలని సూచించారు. డీలర్లు తమ వద్ద ఉన్న విత్తనాలు, ఎరువుల స్టాక్‌ను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు. గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేసి, ఎలాంటి కృత్రిమ ఎరువుల కొరత సృష్టించకుండా, అధిక ధరలకు విక్ర యాలు జరపకుండా డీలర్లు వ్యవహరించాలని పేర్కొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువుల సరఫరా సున్నితమైన అంశమని, అనుమానాస్పద విక్రయాలు కనిపించినచోట వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, డీఆర్డీఓ పీడీ భాస్కర్, డీలర్లు పాల్గొన్నారు.


