జనగామ: భూ భారతి చట్టం అమలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా వెనుకబడి ఉందని, అమలులో పలు సమస్యలు ఉన్నాయని వెంటనే పరిష్కరించాలని హైకోర్టు న్యాయవాది, భూచట్ట నిపుణుడు సాధిక్ అలీ బుధవారం బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సాధిక్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చేసిన సర్వేలో భూ భారతి చట్టం అనుకున్న స్థాయి వరకు అమలు కాలేదని, ముఖ్యంగా సాదాబైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారం చాలా తక్కువగా జరిగిందన్నారు. భూభారతి పోర్టల్‌లో అప్పీల్ ఆప్షన్ పని చేయకపోవడం వల్ల వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. చట్టంలో ఆన్‌లెన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేయాలనే నిబంధన లేకపోయినా అధికారులు వాటినే పరిగణనలోకి తీసుకోవడం అన్యాయమని సర్వే వెల్లడించిందని వివరించారు.


