న్యూస్‌రీల్
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5శాతం రిబేట్ ప్రకటించగా, జనగామ మున్సిపాలిటీలో ఈ పథకానికి మంచి స్పందన లభించింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు ఈ రిబేట్ ఆఫర్‌ను అమలు చేస్తూ ప్రభుత్వం మున్సిపాలిటీల ఆదాయ వనరులను బలోపేతం చేయడంతో పాటు, సమయానికి పన్నులు చెల్లించే వినియోగదారులకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెగ్యులర్‌గా వచ్చే ఆస్తి పన్ను వసూళ్లకు సంబంధించి కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం విస్త్రతంగా తిరుగుతున్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు పన్నుల రూపేణా వచ్చే ఆదాయం సైతం కీలకపాత్ర పోషిస్తుంది.
రూ.కోటి రూపాయలకుపైగా ఆదాయం
జనగామ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15,941 అసెస్‌మెంట్లు ఉండగా, వార్షిక ఆస్తిపన్ను డిమాండ్ రూ. 5 కోట్ల 79 లక్షలుగా నిర్ధారించబడింది. ఇందులో రెగ్యులర్‌గా పన్నులు చెల్లించే వారి అసెస్‌మెంట్లను మాత్రమే రిబేట్ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో 11,376 అసెస్‌మెంట్లు రిబేట్‌కు అర్హులుగా గుర్తించబడ్డారు. ఈ అర్హులైన అసెస్‌మెంట్ల నుంచి మొత్తం డిమాండ్ రూ.3కోట్ల 72 లక్షలుగా మున్సిపాలిటీ లెక్కలు వెల్లడించాయి. రిబేట్ సమయ పరిమితి ముగిసేలోపే 3,131 మంది వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వీరు ఆస్తిపన్ను రూ.1,00,20,087లు మున్సిపాలిటీ ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వ రిబేట్ విధానం ప్రజల్లో మంచి స్పందన రాబట్టడంతో పాటు మున్సిపాలిటీకి ఒకేసారి భారీగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ప్రారంభంలోనే కోటి రూపాయలకుపైనే సమకూరడం ఆర్థికప్రణాళికల అమలులో పురపాలక సంస్థకు మేలు చేయనుంది.
5శాతం సద్వినియోగం
ఆస్తిపన్ను చెల్లింపుల్లో అధిక మొత్తాలు చెల్లించే వినియోగదారుల స్పందన ప్రత్యేకంగా గుర్తించబడింది. ప్రతీ సంవత్సరం లక్ష రూపాయలకు పైగా పన్ను చెల్లించే ఐదుగురు, 50 వేల నుంచి లక్ష రూపాయల మధ్య పన్ను చెల్లించే 26 మంది, అలాగే 25 వేల నుంచి 50 వేల వరకు చెల్లించే 76 మంది వినియోగదారులు రిబేట్ ఆఫర్‌ను అత్యధికంగా వినియోగించుకున్నారు. పన్ను అధికంగా చెల్లించే ఈ వర్గం ముందస్తు చెల్లింపులు మున్సిపాలిటీ ఆదాయానికి మరింత బలాన్నిచ్చాయి.
అసెస్‌మెంట్లు:15,941
ఏటా పన్ను వసూళ్ల డిమాండ్: రూ.5.79కోట్లు
రెగ్యులర్‌గా పన్ను చెల్లించే
ఆస్తిపన్ను దారులు: 11,376
వారి నుంచి ఆస్తిపన్ను అంచనా:
రూ.3.72కోట్లు
5శాతం రిబేట్‌తో పన్ను వసూళ్లు:
రూ.1,00,20,087
రెగ్యులర్ ఆస్తి పన్ను కోసం
ఏప్రిల్ 30తో రిబేట్ గడువు ముగిసినా, మిగిలిన రెగ్యులర్ పన్నుల వసూళ్ల కోసం మున్సిపాలిటీ యంత్రాంగం రంగంలోకి దిగింది. కమిషనర్ ఆదేశాల మేరకు వార్డు ఆఫీసర్లు, బిల్‌కలెక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి పన్ను చెల్లింపులపై అవగాహన కల్పిస్తూ వసూళ్లను వేగవంతం చేస్తున్నారు. ప్రతీ ఏడాది సమయానికి పన్నులు చెల్లించే వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వం అందించే ఈ రిబేట్ విధానం, జనగామ మున్సిపాలిటీలో ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడమే కాకుండా, పౌరుల్లో పన్నుల పట్ల బాధ్యతా భావాన్ని పెంపొందిస్తున్నది.


