జఫర్‌గఢ్: విధి వెక్కిరించినా వెరవలేదు అతడు..కాలం కలిసి రాకున్నా, నా అన్నవాళ్లు తోడులేకున్నా బతుకు పోరాటం ఆపలేదు అతడు..విద్యుదాఘాతంతో ఒక చేయి కోల్పోయిన ఏమాత్రం అధైర్య పడలేదు..ఒంటిచేత్తో జీవనయాత్ర కొనసాగిస్తున్నాడు..
జిల్లాలోని జఫర్‌గఢ్ మండలం తిడుగు గ్రామానికి చెందిన ఎండీ మీయాజాని, బీపాష దంపతులకు నాలుగో కుమారుడు ఎండీ రహీం. కుటుంబ అర్థిక పరిస్థితి బాలేకపోవడంతో 7వ తరగతి మధ్యలోనే తన చదువును ఆపేశాడు. వర్ధన్నపేటలోని స్టార్టర్లు, మోటర్లకు సంబంధించిన మెకానిక్ పనినేర్చుకున్నాడు. 30 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఏడాది పాటు మోకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో మోటర్ వైండింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఎడమ చేయి మణికట్టు పైభాగం వరకు పూర్తిగా చేతిని కోల్పోయాడు. ఒంటిచేత్తో పనిచేసేందుకు ఎవరూ పని ఇవ్వకపోవడం, మరోవైపు మోటార్ వైండింగ్ పనిచేసే అవకాశం లేకపోవడంతో తన స్వగ్రామమైన తిడుగు గ్రామానికి వచ్చాడు. అప్పటికే రహీం తన తండ్రిని కోల్పోవడం, ముగ్గురు సోదరులు కూడా బతుకుదెరువు కోసం పట్టణప్రాంతాల్లో స్థిరపడడంతో తన తల్లి బీపాషతో కలసి ఇంటివద్దనే ఉంటూ చిన్నగా పంక్చర్ కొట్టు పెట్టి సైకిళ్లు, ద్విచక్రవాహనాలకు టైర్ పంక్చర్లను అతుకుతూ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో తల్లిని పోషిస్తూ జీవనం సాగించాడు. ఈక్రమంలో తల్లి అనారోగ్యంతో పూర్తిగా మంచానికి పరిమితం కావడంతో రహీం తన తల్లికి సేవలు చేస్తూ మరోవైపు తన వృత్తిని కొనసాగిస్తూ వచ్చాడు. ఉపాధి హామీ పనులకు సైతం వెళ్లేవాడు. ఇలా ఉండగా నెలరోజుల క్రితం తల్లి బీపాష అనారోగ్యంతో తనువుచాలించింది. దీంతో ఒంటరి అయిన రహీం తన దుఃఖాన్ని కడుపులో దాచుకుంటూ బతుకుబండిని సాగిస్తున్నాడు. తనకు ప్రభుత్వం నుంచి పింఛను వస్తున్నప్పటికీ ఏమాత్రం సరిపోవడం లేదని పైగా తన పక్కనే మరో పంక్చర్ కొట్టు పడడం వల్ల గిరాకీ కూడా రావడం లేదని దీనివల్ల తన పోషణ కష్టంగా మారిందని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చేయి కోల్పోయి ఒంటరైన తనకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించడంతో పాటు మూడు చక్రాల బండిని అందజేసి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
విద్యుదాఘాతంతో చేయికోల్పోయిన రహీం
ఒంటిచేత్తోనే పంక్చర్ షాపు నిర్వహణ
తల్లిదండ్రుల మరణంతో ఒంటరిగా జీవనం
ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు


