ప్రమాదకరంగా గ్రిల్స్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా గ్రిల్స్‌

May 20 2026 1:52 AM | Updated on May 20 2026 1:52 AM

జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ప్రధాన దారిలో కుక్కలు, పందులు లోనికి రాకుండా ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ ప్రమాదకరంగా మారాయి. గ్రిల్స్‌ మొదట్లో సిమెంటు దిమ్మెలు ఊడి పోవడంతో గ్యాప్‌ పెరిగిపోవడంతో ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు ప్రమాదవశాత్తు అందులో పడిపోతున్నారు. మంగళవారం జనగామకు చెందిన కాసుల శ్రీనివాస్‌తో పాటు మరో పేషెంట్‌ కాళ్లు ఇరుక్కు పోవడంతో బలవంగా బయటకు తీశారు. ప్రమాదంగా మారిన గ్రిల్స్‌ ప్రదేశంలో మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.

నేడు మెడికల్‌ షాపుల బంద్‌

కొడకండ్ల: ప్రజల ఆరోగ్య రక్షణ, చిన్న వ్యాపారుల సంక్షేమం, ఫార్మసి వ్యవస్థ పరిరక్షణ కోసం కెమిస్ట్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు ఈనెల 20న (బుధవారం) మెడికల్‌ షాపులు స్వచ్ఛందంగా బంద్‌ చేస్తున్నట్లు మెడికల్‌ షాపుల అసోసియేషన్‌ నాయకులు తెలి పారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్‌ ఉత్తలూరి అనీల్‌బాబుతో పాటు పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రాలు సమర్పించారు. కృష్ణమూర్తి, సందీప్‌, కిరణ్‌ పాల్గొన్నారు.

రేపు వేదలో స్వర్ణ ప్రాశన

జనగామ: జనగామ పట్టణం హైదరాబాద్‌ రోడ్డు ఏకశిల బీఈడీ కళాశాల ఎదురుగా ఉన్న వేద ఆయుర్వేద పంచకర్మ వెల్‌నెస్‌ సెంటర్‌లో పుష్యమి నక్షత్రం పురస్కరించుకుని కొడిమల సత్తిరెడ్డి జ్ఞాపకార్థం ఈ నెల21న ఉచిత స్వర్ణ ప్రాశన శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్‌ అంజిరెడ్డి మంగళవారం తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 6 నెలల నుంచి 16 సంవత్సరాల యువకులకు స్వర్ణ ప్రాశన వేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

అవగాహనతోనే

మహిళల ఆర్థికాభివృద్ధి

పాలకుర్తి: అవగాహనతోనే మహిళలు ఆర్థికాభివృద్ధి చెందుతారని సెర్ప్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ స్వర్ణలత అన్నారు. పాలకుర్తిలోని ఇందిరమ్మ మహిళా సంఘం కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు ఇస్తున్న శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న అవకాశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏడీ ఎండీ నూరొద్దీన్‌, ఏపీఎం వెంకటేశ్వర్లు, మండల మహిళా సంఘం అధ్యక్షులు భాగ్యలక్ష్మి, 61 గ్రామాల మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

విద్యార్థినికి సన్మానం

జఫర్‌గఢ్‌: టెన్త్‌ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి 562 మార్కులు సాధించిన ఉప్పుగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని బుర్ర సంకీర్తనను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఐ పౌండేషన్‌ ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్‌కుమార్‌రెడ్డి, విద్యావేత్త ఎమ్మెల్సీ కోదండరామ్‌ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బహుమతితో పాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

రఘునాథపల్లి: మండలంలోని రఘునాథపల్లి–ఇప్పగూడ రైల్వే ట్రాక్‌ పక్కన గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 8.20 గంటల సమయంలో కోమళ్ల సమీపంలోని కిలోమీటర్‌ నంబర్‌ 292/6–4 వద్ద డౌన్‌ ట్రాక్‌ పక్కన గాయాలతో వ్యక్తి పడి ఉండటాన్ని పాయింట్స్‌మెన్‌ రాజేంద్రప్రసాద్‌ గమనించాడు. వెంటనే పై ఽఅధికారులకు సమాచారం అందించడంతో పాటు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. అంబులెన్స్‌లో గాయపడిన వ్యక్తిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 10.06 గంటలకు మృతి చెందాడని, ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడినట్లుగా బావిస్తున్నట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, సెల్‌ ఫోన్‌ లేదు. అయితే అతడి వద్ద సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లేందుకు తీసుకున్న జనరల్‌ టికెట్‌ లభించింది. మృతుడు సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, చామనచాయ రంగు, కోల ముఖం, గడ్డం పెరిగి ఉండగా, కుడి వైపు మెడపై పుట్టుమచ్చ, లేత అకుపచ్చ గ్రే కలర్‌ టీ షర్ట్‌, నీలి రంగు లోయర్‌ (నైట్‌ ప్యాంట్‌) ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి అచూకి తెలిసిన వారు 9712658609, 8712539530 నంబర్లలో సంప్రదించాలని రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఆంజనేయులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement