జనగామ: జిల్లాలో ప్రజల్ని పట్టి పీడిస్తున్న 12 సమస్యలను కలెక్టర్ పరిష్కరించాలని కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీ కన్వీనర్ ఎండీ సాదిక్ ఆలీ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలెక్టర్‌తో మాట్లాడి చేయించాలన్నారు. అనేక పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే అన్ని వర్గాలను ఉద్దేశించి నిర్మాణం చేసిన సెల్లార్‌కు ద్విచక్రవాహనాలతో పాటు కార్లను అనుమతించాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలో తొలగించిన వనిత టీ, డెయిరీ స్టాళ్లను అదే స్థలంలో ఏర్పాటు చేయాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో పేరుకు పోయిన ధాన్యం నిల్వలను 10 రోజుల లోపు కొనుగోలు చేసి తరలించాలన్నారు. అన్‌లోడింగ్, ట్రాన్స్ పోర్టు సమస్యను పరిష్కరించే బాధ్యతగా కలెక్టర్ తీసుకోవాలన్నారు. ఇసుక, మట్టి రవాణా సమస్యను పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కలెక్టరేట్ వద్ద ఇసుక డంప్ చేసి అవసరమైతే ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ఇతర నిర్మాణాలకు నాణ్యమైన ధరకు ఇసుకను అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉన్న క్యాంటీన్‌ను తిరిగి అదే స్థలములో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తామని సాదిక్ ఆలీ తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాధిత రక్షణ కమిటీ కో కన్వీనర్లు, జేఏసీ అధ్యక్షులు మంగళ్లపల్లి రాజు, సాంబరాజు యాదగిరి, బూడిద గోపి, శేఖర్, టీఆర్‌ఎస్ (కవిత ) పార్టీ నాయకులు ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ కత్తుల రాజిరెడ్డి, న్యాయవాదులు ధర్మభిక్షం, వేణు, పాలమాకుల మంజుల తదితరులు ఉన్నారు.
● కలెక్టర్‌కు డిమాండ్లు పెట్టిన
పోరాట కమిటీ


