జనగామ రూరల్: తాలు, తరుగు, మట్టి పేరుతో రైతుల సొమ్ములో కోతలు విధించే మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే సీజ్ చేయడానికి వెనుకాడబోమని సివిల్ సప్లయీస్ డీఎం హతీరామ్ హెచ్చరించారు. ఇటీవల పెంబర్తిలో జరిగిన ఆందోళన నేపథ్యంలో సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు సోమవారం స్పందించారు. జనగామ మండలం పెంబర్తి కొనుగోలు కేంద్రంలో ఇప్పటికే తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లుకు కేటాయించామన్నారు. మిల్లు వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియలో కొంత ఆలస్యం జరగడం, లారీల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగిందన్నారు.
రవాణా సేవలు పెంచుతున్నాం
పాలకుర్తి మండలం దర్దెపల్లి కొనుగోలు కేంద్రంలో రైతు ధాన్యానికి సంబంధించిన తక్‌పట్టి, ట్రక్ షీట్ ఎంట్రీల వ్యత్యా సం, జనగామ మండలం చీటకోడూరు రైతుల తూకంపై విచారణ అనంతరం చర్యలు ఉంటాయని డీఎం హతీరామ్ తెలిపారు. జిల్లాలోని సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు, రైస్ మిల్లుల్లో దిగుమతుల్లో జాప్యం, తూకంలో కోతలు, తదితర అంశాలపై సాక్షిలో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. తరుగు పేరిట రైతులను మోసం చేయవద్దని నిర్వాహకులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు.


