మెరుగైన వైద్యం అందించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
● ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన
జనగామ రూరల్: వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించి వారి మన్ననలు పొందాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం స్ధానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి, ఆసుపత్రిలోని ల్యాబ్‌లను, సీటీ స్కానింగ్ గదిని, ప్రత్యేక వైకల్య గుర్తింపు, కార్డు కేంద్రం, ప్రత్యేక సామర్థ్యాల మూల్యాంకన కేంద్రం, డయాలసిస్ యూనిట్, జనరల్ వార్డును నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం పనులను కలెక్టర్ పరిశీలించారు. పేషెంట్ల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వారికి అందిస్తున్న వైద్య సేవలను వసతులను తెలుసుకున్నారు. ఇటీవల ప్రారంభించిన సీటీ స్కాన్ యంత్రాన్ని పరిశీలించి, దాని పనితీరు, ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులకు స్కాన్లు నిర్వహించారనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలుబు, ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడుతున్నందున ఈఎన్‌న్‌టీ వైద్యుల సూచన మేరకు కలెక్టర్ స్వయంగా ప్యారానాసల్ సైనసెస్‌కు సీటీ స్కాన్ చేయించుకున్నారు. కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ వి.రాజలింగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జునరావు, ఆర్‌ఎంఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కోర్టు భవన పనులు పరిశీలన
చంపక్ హిల్స్‌లో నిర్మాణం జరుగుతున్న జిల్లా కోర్టు భవన పురోగతిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పనులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి పలు సూచనలు ఇచ్చి నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, డీఆర్‌డీఓ వసంత, ఆర్‌అండ్‌బీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నేల సంపదను కాపాడుకోవాలి..
నేల ఆరోగ్యం, పోషక స్థితి అంచనాతో జీవవైవిధ్యం మెరుగు అవుతుందని, నేల మన సంపద కాపాడుకోవడమే మన భవిష్యత్తు భద్రత అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. నేల ఆరోగ్య పరిరక్షణ, పంట దిగుబడుల పెంపు, భవిష్యత్ తరాలకు సారవంతమైన నేలను అందించాలనే లక్ష్యంతో చౌడారం మోడల్ పాఠశాలలో స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికా రి అంబికా సోని, సహాయ జిల్లా విద్యాశాఖ అధి కారి సత్యమూర్తి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు వెంకటరమణ, తేజస్వి, మండల వ్యవసాయ అధికారి విజయ్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధీర్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్‌డీఎఫ్ పథకం ఉపయోగకరం
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలతో పాటు అనుకోకుండా మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించే ఎఫ్‌డీఎఫ్ పథకం ఉపయోగకరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో యూటీఎఫ్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ అవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు చంద్రశేఖర్‌రావు, మదూరి వెంకటేష్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించాలి


