ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
స్టేషన్‌ఘన్‌పూర్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ మండల పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారం సాయంత్రం ముగిసింది. మండల పరిధిలో మొత్తం 15 గ్రామ పంచాయతీలకు గాను 146 వార్డులున్నాయి. అందులో జిట్టెగూడెం తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానంతో పాటు మొత్తం 8 వార్డులకు ఒకే ఒక్క నామినేషన్లు దాఖలు కావడంతో నామినేషన్ల ఘట్టం చివరిరోజునే సర్పంచ్‌తో పాటు వార్డులన్నీ ఏకగ్రీవమైన విషయం విదితమే. మిగిలిన 14 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ స్థానాలకు మొత్తంగా 91 నామినేషన్లు, వార్డులకు 352 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే బుధవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉండగా సర్పంచ్ స్థానాలకు 43 మంది ఉపసంహరణ చేసుకోగా ప్రస్తుతం 14 జీపీలకు 48 మంది బరిలో ఉన్నారు. అదేవిధంగా వార్డు స్థానాలకు 352 మంది ఉండగా 41 మంది నామినేషన్లు ఉపసంహరణ చేసుకోగా 311 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు, ఎంపీడీఓ నర్సింగరావు తెలిపారు.
24 వార్డులు ఏకగ్రీవం
మండల పరిధిలో మొత్తంగా 146 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 24 వార్డులు ఏకగ్రీవయ్యాయి. అందులో జిట్టెగూడెం తండాలో 8 వార్డులు, చంద్రుతండాలో 7, పాంనూర్‌లో 4, అక్కపెల్లిగూడెంలో 3, నమిలిగొండ 1, విశ్వనాధపురం 1 వార్డు ఏకగ్రీవమయ్యాయి.


