తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి
● మండలాలకు బ్యాలెట్ పత్రాలు
జనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఈ నెల11వ తేదీన తొలి విడత ఎన్నికలు జరుగనున్న సందర్భంగా పోలింగ్ నిర్వహణ కోసం ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. గురువారం కలెక్టరేట్‌లో సాధారణ ఎన్నికల అబ్జర్వర్ రవికిరణ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పారదర్శకంగా నిర్వహించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో మొదటి దశలో ఎలక్షన్ నిర్వహించేందుకు పీఓ–1,138, ఓపీఓ–1,552 మందిని ఎంపిక చేశారు.
సజావుగా నిర్వహించాలి..
జిల్లాలో మొదటి విడత ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.
మండలాలకు బ్యాలెట్ పత్రాలు
మొదటి విడతలో జరుగనున్న ఎలక్షన్లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం లోని ఐదు మండలాల ఎంపీడీఓలకు అప్పగించారు. కలెక్టరేట్ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన బ్యాలెట్ పేపర్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి వసంతతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
నిబంధనల ప్రకారమే నిర్వహించాలి..
జనగామ రూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణికుముదిని సూచించారు. గురువారం కలెక్టర్లతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తు పరిశీలించి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలెటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. అబ్జర్వర్ రవికిరణ్ మాట్లాడుతూ..జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు తగ్గట్టుగా జరుగుతున్నాయని చెప్పారు. వీడియో కాన్పరెన్స్ అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలో 10 సర్పంచ్ స్థానాలు, 228 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా..7 గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు మొత్తం ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు.


