నిబంధనల మేరకే ఖర్చు చేయాలి
● జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ
స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల మేరకే ఖర్చులు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ సూచించారు. మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్థానిక రైతు వేదికలో ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యయాలు, నిబంధఽనలు తదితర అంశాలపై గురువారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్‌లుగా పోటీ చేసే వారు 5వేల జనాభాకు పైగా ఉంటే రూ.2.50లక్షలు, 5వేల జనాభాకు లోపు ఉంటే రూ.1.50 లక్షలు ఖర్చు చేయవచ్చన్నారు. వార్డు స్థానాలకు రూ.50వేలు, రూ.30వేలు ఖర్చు చేయవచ్చన్నారు. అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సుకుమార్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ కృష్ణ, సీఐ జి.వేణు, అభ్యర్థులు పాల్గొన్నారు.
లింగాలఘణపురంలో..
లింగాలఘణపురం: మండలంలోని బండ్లగూడెం రైతు వేదికలో మండలంలోని సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి, మండల ఎన్నికల అధికారి ప్రసాద్, ఎస్సై శ్రావణ్‌కుమార్, డీటీ షకీర్, ఎన్నికల ట్రైనర్ కోటి తదితరులు పాల్గొన్నారు.
చిల్పూరులో..
చిల్పూరు: పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులకు మండల కేంద్రంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎస్సై సిరిపురం వినయ్‌కుమార్, ఎంపీఓ మధుసూదన్ ఉన్నారు.


