ఉప యోగం!
ఖర్చు నాది.. మద్దతు నీది
● సర్పంచ్ రిజర్వేషన్లలో నిరాశ.. ‘సెకండ్ పవర్’ కోసం ఆశ
● ఉప సర్పంచ్ పదవితో రాజకీయ భవిష్యత్‌ను నిర్మించుకునే ప్రయత్నం
● ఎన్నికల కంటే ముందే లక్షల రూపాయలతో ఒప్పందాలు..?
● పార్టీలు పక్కన బెట్టి.. రహస్య సమీకరణాలు
● పలుచోట్ల సర్పంచ్ పదవికి మించి పోటీ
● జిల్లాలో సర్పంచ్‌లు–280.. వార్డులు 2,534
జనగామ: సర్పంచ్ రిజర్వేషన్లు ఆశావాహులకు నిరాశ కల్పించగా, ఉప సర్పంచ్ పీఠంపై అందరి కన్ను పడింది. సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో జిల్లాలో పలువురు నాయకులు ‘సెకండ్ పవర్ సీటు’ వైపు దష్టి సారించారు. వార్డు రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో, సభ్యుల మద్దతు కోసం లక్షల రూపాయలతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. కొన్నిచోట్ల పార్టీలను పక్కనపెట్టి వ్యక్తిగత బంధాలు, ఆర్థిక హామీలతో వార్డు సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు భారీగా కసరత్తు చేస్తున్నారు. గ్రామస్థాయి పాలనలో ఉప సర్పంచ్ పదవికి ఉన్న చెక్ పవర్, నిర్ణయాధికారం, ప్రభావం కారణ ంగా ఈసారి పోటీ సర్పంచ్ రేసుకు మించినంత తీవ్రంగా కనిపిస్తోంది. ఉప సర్పంచ్ పదవి చేపట్టి రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆతృతతో అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు.
జిల్లాలో రిజర్వేషన్లు ఇలా..
జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలు, 2,534 వార్డులు ఉన్నాయి. ఎస్టీ వార్డులు–300, ఎస్సీ వార్డులు–157, బీసీ వార్డులు – 456, జనరల్ వార్డులు–1,120 వార్డుల పరిధిలో మహిళలు, జనరల్ కలుపుకుని రిజర్వేషన్లు కలిసి రాగా, సర్పంచ్ రిజర్వేషన్లలో జనరల్–123, బీసీ జనరల్–45, ఎస్సీ జనరల్–54, ఎస్టీ జనరల్– 58 రెండు కేటగిరీల్లో రిజర్వేషన్లు ఉన్నాయి.
సర్పంచ్ తర్వాత ‘ఉప’కు ప్రాధాన్యం..
గ్రామస్థాయి పాలనలో సర్పంచ్ తర్వాత అత్యంత ప్రభావవంతమైన పదవి ఉప సర్పంచ్‌కే దక్కుతుంది. అభివృద్ధి పనుల పరిశీలన, పంచాయతీ నిర్ణయాల్లో చురుకై న పాత్ర కారణంగా ఈ పదవి రాజకీయాల్లో మంచి స్థానం కల్పిస్తోంది. ఈసారి అయితే ఉప సర్పంచ్ పోటీ కూడా సర్పంచ్ రేసును తలదన్నేంత స్థాయిలో మారింది. ఎలాగైనా ఉప సర్పంచ్ పీఠాన్ని కై వసం చేసుకుని గ్రామ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఇదే గోల్డెన్ ఛాన్స్‌గా భావిస్తున్నారు. ఉప సర్పంచ్ పీఠం చుట్టూ నెలకొంటున్న హడావుడి గ్రామ రాజకీయాల్లో హీట్ పెరిగేలా చేస్తోంది. మేజర్ పంచాయతీలు, ఆదాయ వనరులు కలిగిన జీపీలపైనే ఎక్కువగా గురి పెడుతున్నారు.
పార్టీ నాయకత్వం..నిఘా వర్గాల ఆరా
వార్డు స్థాయిలో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో వార్డు అభ్యర్థుల కదలికలు, సమావేశాలు, ఆర్థిక హామీలు, అభివృద్ధి వాగ్దానాలకు సంబంధించి పార్టీలకు చెందిన నాయకత్వంతో పాటు నిఘా విభాగాలు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఏ వార్డులో ఎవరు ప్రభావం చూపుతున్నారు, ఎవరి మీద ఒత్తిడి పెరుగుతోంది అన్న విషయాలను పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఉపసర్పంచ్ పీఠం ద్వారా గ్రామ రాజకీయాల్లో పట్టుకోసం జరుగుతున్న ఈ రహస్య రచ్చ పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గ్రామంలో వార్డుల సంఖ్య ఆధారంగా ఉప సర్పంచ్ కోసం ఉబలాట పడిపోతున్న పలువురు ఆశావహులు వార్డు సభ్యులకు ఎన్నికల ఖర్చులకు సంబంధించి ముందుగానే కొంత సొమ్ము ముట్టజెబుతూ ఒప్పంద పత్రాలు రాయించుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది. వార్డు మెంబర్‌గా విజయం సాధించిన తర్వాత ఉప సర్పంచ్‌గా ఎన్నుకునే సమయంలో ఓటు తనకే వేయాలన్న హామీ ఇప్పుడే తీసుకుంటున్నారనే చర్చ రాజకీయ వేడిని పెంచుతోంది. పార్టీలను పక్కన పెట్టి మెజార్టీగా వ్యక్తిగతంగా కలిసేవారితోనే అవగాహన కుదుర్చు కోవడం ఈసారి ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది. గత ఏడాదిన్నరగా పర్యటనలు, పబ్లిసిటీలతో లక్షల్లో ఖర్చు చేసిన ఆశావాహులు సర్పంచ్ పదవులకు వచ్చిన రిజర్వేషన్లు చాలామందికి అనుకూలించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏళ్ల తరబడి నిరీక్షణపై రిజర్వేషన్లు నీళ్లు చల్లడంతో రాజకీయ భవిష్యత్తును ని లబెట్టుకోవాలంటే ఉప సర్పంచ్ పీఠమే శరణ్యమని భావిస్తూ... ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు.
ఉప యోగం!


