అన్నా..తప్పక రావాలె
పట్టణాల్లో ఉంటున్న ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు
జనగామ: గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి నడుస్తోంది. పల్లెల్లో జరుగుతున్న ఎన్నికల సన్నాహాలు పెళ్లి విందు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అభ్యర్థుల ఇళ్లలో హడావుడితో పాటు బయట కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్, భీవండి, నిజామాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రావెల్స్ బస్సులు, కార్లను ముందస్తుగా బుక్ చేస్తున్నారు. పోలింగ్ రోజున సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చే వాహనాలు ఆలస్యం కాకుండా అవ్వకుండా ముందస్తుగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు.
అభ్యర్థుల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, బం ధువులు, గ్రామస్థులు ఎవరికి వారే పనుల్లో బిజీగా గడిపేస్తున్నారు. తమ ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేసి, వారిని తమ వైపు తిప్పుకునేందుకు రూట్ల వారీగా ఒక్కో నాయకునికి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ‘అన్నా హైదరాబాద్‌లో ఉన్న మనోడు వచ్చాడా.. భీవండి నుంచి బయలు దేరారా..’ అనే చర్చలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లి ఆహ్వాన పత్రాలు పంపినట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో ఓటర్లకు తమ అభ్యర్థి తరపున సందేశాలు పంపిస్తున్నారు. ‘అన్నా పోలింగ్ రోజు తప్పకుండా గ్రామానికి రావాలి.. మీ అమూల్యమైన ఓటు వేయాలి..’అంటూ మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభ్యర్థులు ముహూర్తాలు చేసుకుని పట్నం బయలు దేరి ఊరి ఓటర్లు ఉన్న కాలనీలకు వెళ్లి సమావేశాలతో వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘గ్రామం అభివృద్ధి కోసం ఓటు వేసి...అన్నను గెలిపించే బాధ్యత మీపైనే ఉంది..’ అంటూ ఆ బాధ్యతను వారిపైనే వదిలేస్తున్నారు. ఊరి ఓటర్లతో పాటు గెలుపులో పట్నం ఓటర్లు కింగ్ మేకర్లుగా మారనున్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారు.. ఎప్పుడు వస్తారు.. ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయాలి, ఖర్చు ఎంత అనే బిజీలో అభ్యర్థుల అనుచరులు నిమగ్నమయ్యారు. మరికొంత మంది అభ్యర్థులు తమ ఓటర్లకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారు. వలసల పెరుగు దలతో ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో పట్నం ఓటర్ల ప్రభావం పెరిగింది. అందుకే అభ్యర్థులందరూ వారిపైనే గంపెడాశలు పెట్టుకుంటున్నారు.
గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించే విధంగా విందు రాజకీయాలకు తెర లేపుతుండగా, పట్నంలో ఉన్న వలస పక్షులను సైతం తమవైపు తిప్పుకునేందుకు బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి ఆయా ప్రాంతాల్లో రోజువారీ వంటకాలు, విందులకు ప్లాన్ చేసుకుంటున్నారు. పట్నం ఓటర్లు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారనే లెక్కల మేరకు ఒక్కో ఏరియాకు ఇన్‌చార్జ్‌లను నియమించి పోలింగ్ తేదీ వరకు అక్కడే ఉండే విధంగా ప్లాన్ చేశారు. ఇన్‌చార్జ్‌లు ప్రతి రోజు వలస ఓటర్లను కలవడం, పనులు ముగించుకుని ఇంటికి రాగా దావత్‌లతో ఖుషీ చేయడం వంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండాలి. ఈ తతంగమంతా గురువారం నుంచి మొదలు కానుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను తలదన్నే రీతిలో సర్పంచ్ ఎలక్షన్లలో డబ్బుల ప్రవాహం ఏరులై పారుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో మినీ దావత్‌లు నడుస్తుండగా... ఒకటి, రెండు రోజుల్లో సుక్కా, ముక్కలతో విందులు షురూ కానున్నాయి.
ఒక్క ఓటే ఫలితాన్ని తారుమారుచేయగల పరిస్థితుల్లో ప్రతి అభ్యర్థి వలస ఓటర్లను రప్పించుకోవడానికి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. గతంలో చివరి క్షణంలో ఒక్క ఓటే పదలు సంఖ్యలో అభ్యర్థుల ఆశలను తలకిందులు చేసిన సంగతి మనం చూసిందే. ఆ అనుభవాలను గుర్తుకు చేసుకుంటూ ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారే ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.
హైదరాబాద్, భీవండి..
తదితర పట్టణాలకు ట్రావెల్స్ బస్సులు
ప్రతీ ఓటు కీలకం కావడంతో
దూరప్రాంత ఓటర్లపై నజర్
ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సోషల్ మీడియా వాడకం
అన్నా..తప్పక రావాలె
అన్నా..తప్పక రావాలె
అన్నా..తప్పక రావాలె


