ఊపందుకున్న పల్లెసమరం
ఏకగ్రీవమైన చోట ఉపసర్పంచ్ ఎన్నిక
జనగామ: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగనున్న నేపథ్యంలో రాజ కీయ పరిణామాలు ఊపందుకున్నాయి. మొదటి విడత నామినేషన్లు ఉపసంహరించుకుని ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడ చూసినా అభ్యర్థుల మధ్య అభివృద్ధి నినాదం, ఆధిపత్య పోరాటం స్పష్టంగా కనినిస్తోంది. రెండో విడత ఎలక్షన్లు జరిగే జనగామ నియోజకవర్గంలో బుజ్జగింపుల పర్వం సాగుతోంది. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి మూడు దశల్లో ఎలక్షన్లు కొనసాగుతుండటంతో జిల్లాలో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తోంది. ఒక వైపు పల్లెల్లో ప్రచార డప్పులు మోగుతుంటే, మరో వైపు జనగామలో స్క్రూటినీ, విచారణలు అభ్యర్థులను టెన్షన్ పుట్టిస్తోంది. పాలకుర్తిలో నామినేషన్ల కోసం అభ్యర్థుల వరుసకడుతున్నారు.
ప్రచారం షురూ...
స్టేషన్ ఘన్‌్‌పూర్ నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం నుంచి ప్రచారం అధికారికంగా ప్రారంభమైంది. అభ్యర్థులు స్థానికులతో సమావేశాలు నిర్వహిస్తూ, ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. గ్రామాల్లో ప్రజలు ఎదురుచూస్తున్న అభివృద్ధి అంశాలను ముందుకు తెస్తూ, తమ వాదాన్ని గట్టిగనే వినిపిస్తున్నారు. పల్లెల్లో బ్యానర్లు, ర్యాలీలు ఎన్నికల వాతావరణాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ 324 మంది సర్పంచ్, 1,950 మంది వార్డు సభ్యులు బరిలో నిలిచారు. స్టేషన్‌ఘన్‌పూర్ సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులను కేటాయించడంతో క్షణం ఆలస్యం చేయకుండా అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లిపోయారు.
జనగామలో స్క్రూటినీ..
ఇదే సమయంలో జనగామ నియోజకవర్గంలో నా మినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ జరుగుతోంది. అభ్యర్థులు ఇచ్చిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఎవరి నామినేషన్ ఆమోదం పొందుతుందో, తిరస్కరణకు ఎవరిది గురవుతుందో అన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
పాలకుర్తి నియోజకవర్గంలో మూడో విడతగా మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు జీపీల వద్ద బారులు దీరారు. దీంతో నామినేషన్ కౌంటర్లు బిజీగా మారాయి. అభ్యర్థులు, పార్టీ పెద్దలు, మద్దతుదారులు అందరూ మూడు చోట్ల మూడు విధాలుగా రంగంలో దిగడంతో గ్రామపంచాయతీ ఎన్నికల వేడి రాబోయే రోజుల్లో మరింత ఉధృతం కానుంది. పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి రోజు సర్పంచ్‌కు 41, వార్డులకు 37 నామినేషన్లు వచ్చాయి. జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పులలో 25 సర్పంచ్, 6 వార్డు నామినేషన్లను తిరస్కరించారు. బచ్చన్నపేటలో 5 సర్పంచ్, 36 వార్డుల నామినేషన్లను తిరస్కరించారు.
జిల్లాలో సర్పంచ్ ఏకగ్రీవమైన గ్రామాల్లో ఈనెల 4న ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. ఇందుకు సంబంధిత మండలాల ఎంపీడీఓలు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ప్రచారం షురూ
జనగామలో స్క్రూటినీ ప్రక్రియ
పాలకుర్తిలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం


