నేటినుంచి రెండో విడత నామినేషన్లు
జనగామ నియోజకవర్గ సమాచారం
జనగామ: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మొదటి విడత శనివారంతో ముగియగా, జనగామ నియోజకవర్గంలో నేటి (ఆదివారం) నుంచి రెండో విడత నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల ఎలక్షన్ అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతీ రోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్ కేంద్రాల గేట్లను మూసివేస్తారు. అప్పటి వరకు కేంద్రాల ప్రాంగణంలో ఎంతమంది ఉన్నా.. నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఎన్నికల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రానికి అభ్యర్థులు, ప్రతిపాదించే వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది.
జనగామ నియోజకవర్గంలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల పరిధిలోని 79 గ్రామ పంచాయతీలు, 710 వార్డుల్లో నేటి (ఆదివారం) నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మూడు లేదా నాలుగు గ్రామాలను కలిపి క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. నర్మెటలో4, జనగామలో 5, తరిగొప్పులలో 5, బచ్చన్నపేటలో 5 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. రెండవ విడత నామినేషన్లను పురస్కరించుకుని బ్యాలెట్ బాక్స్, మెటీరియల్‌ను కలెక్టరేట్ స్ట్రాంగ్ రూం నుంచి మండలాలకు తరలించారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. చివరి రోజు 30 క్లస్టర్లలో నామినేషన్ వేసేందుకు ఆయా పార్టీలు అభ్యర్థులు, స్వతంత్రులు బారులుదీరారు. చివరి రోజు రాత్రి 11.30 గంటల వరకు కొనసాగింది. మొత్తం 110 జీపీలకు 355, 1024 వార్డులకు 1,398 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
జనగామ నియోజకవర్గంలో
79 జీపీలు, 710 వార్డులు
ముగిసిన మొదటి విడత నామినేషన్లు
ఘన్‌పూర్‌లో రాత్రి వరకు
కొనసాగిన నామినేషన్లు
మండలం జీపీ వార్డులు క్లస్టర్లు
జనగామ 21 198 5
నర్మెట 17 148 4
తరిగొప్పుల 15 126 5
బచ్చన్నపేట 26 238 5
మొత్తం 79 710 19
నేటినుంచి రెండో విడత నామినేషన్లు


