
అభివృద్ధి జాడేది?
జిల్లా వివరాలు
నిధులు రావు.. అప్పులు పుట్టవు
జనగామ: గ్రామపంచాయతీలకు రెండేళ్లుగా నిధులు లేక జేబు ఖర్చుతో నడిపించే దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో గ్రామీణ పరిపాలన క్రమక్రమంగా చతికిల బడిపోతుంది. జీపీ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పనుల జాడ లేకుండా పోయింది. 2024 ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అన్ని పంచాయతీలు స్పెషల్ పాలన కిందకు వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవడం, ఆ తర్వాత హైకోర్టు స్టే రావడంతో గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు లేకుండా పంచాయతీల పాలనకు స్పీడ్ బ్రేకర్లు పడుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి వచ్చే 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే ఎస్‌ఎఫ్‌సీ (స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్) బడ్జెట్ పంచాయతీలకు ప్రాణాధారం లాంటివి. జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నెలనెల రూ.65 కోట్లు, ఎస్‌ఎఫ్‌సీ ద్వారా ప్రతీ సంవత్సరం రూ.8 కోట్లు రావాల్సి ఉంది. ఇలా రెండేళ్ల కాలానికి రూ.810 కోట్ల మేర నిధులకు గ్రహణం పట్టింది. రెండేళ్లుగా పాలక మండలి లేకపోవడంతో ఈ రెండు వనరులు ఆగిపోయాయి. దీంతో పంచాయతీల పని తీరు పూర్తిగా క్షీణించింది. నిధుల లేమితో మౌలిక వసతుల పనులు ఆగిపోగా, శానిటేషన్, వీధి లైట్లు, నీటి సరఫరా వంటి ప్రాథమిక సేవలు సైతం కష్టసాధ్యమయ్యాయి.
జిల్లాలోనే సుమారు 280 గ్రామపంచాయతీలు, 2,534 వార్డులు, సుమారు 5.40 లక్షల జనాభా ఉన్నారు. ఒక మేజర్ పంచాయతీ పరిధిలో రోజు వారీగా కనీసం రూ.3 వేలు, మైనర్ పంచాయతీలకు రూ.15వందల వరకు ఖర్చు అవుతోంది. కానీ ప్రస్తుతం పంచాయతీ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా మిగిలి ఉండకపోవడంతో నల్లా పన్నులతో పాటు కార్యదర్శులు అప్పులు చేసి తమ సొంత ఖర్చుతో వ్యవహారాలు నెట్టుకువస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా నిధులు రాలేదు, చెత్త సేకరణకు వాహనం డీజిల్ ఖర్చు చేయాలంటే కూడా జేబులోంచి ఖర్చు చేస్తున్నాం, బిల్లులు రాయించుకున్నా చెల్లింపులు లేవు. సర్పంచ్ లేకపోవడంతో నిర్ణయాలు కూడా ఆలస్యం అవుతున్నాయంటూ ఓ పంచాయతీ సెక్రటరీ ఆవేదనకు గురయ్యారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే కారణంగా కొత్త ప్రజాప్రతినిధులు రావడం మరికొంత ఆలస్యం కానుంది. ఈ పరిస్థితుల్లో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమితో శానిటేషన్ అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రజాప్రతినిధులు లేని పాలనతో గ్రామీణ అభివృద్ధి కేవలం పేపర్‌పైనే మిగిలిపోయిందనే అభిప్రాయాలను మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు.
సర్పంచ్‌లు లేని
పాలనలో సేవలకు ఆటంకం
జీపీలకు నిధులు రాక రెండేళ్లు
జిల్లాకు రూ.810 కోట్ల మేర పెండింగ్
జీపీలు వార్డులు జనాభా (సుమారు)
280 2,534 5.40లక్షలు