
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నిరాశ!
జనగామ: స్వచ్ఛత కోసం కేంద్ర ప్రభుత్వం పట్టణ, నగరాల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌కు శ్రీకారం చుట్టింది. తడి, పొడి చెత్త సేకరణ, ఎరువు తయారీ, వ్యక్తిగత మరుగుదొడ్లు, రహదారులపై ఎప్పటికప్పుడు చెత్త సేకరణ తదితర విభాగాల్లో ఏటా పురపాలిక, కార్పొరేషన్ పరిధిలో కాంపిటీషన్ నిర్వహిస్తోంది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024–25 వార్షిక సంవత్సరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు ఫలితాలను ఈ నెల 17న విడుదల చేశారు. స్వచ్ఛత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జనగామ మున్సిపాలిటీకి నిరాశే ఎదురైంది. గత ర్యాంకు కంటే మెరుగు పరుచుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. దీంతో అధ్వానమైన శానిటేషన్ నిర్వహణతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పూర్ ఫర్ఫార్మెన్స్ ర్యాంకును మూటగట్టుకుంది. పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు దీనిని ప్రారంభించారు. జనగామ మున్సిపాలిటీ గతంలో ఒకటవ స్టార్ గెలుచుకోగా.. 2024–25 సంవత్సరంలో త్రీ స్టార్ ర్యాంకు కోసం అప్‌లైయ్ చేసుకున్నారు. స్వచ్ఛతపై ప్రజలను భాగస్వామ్యం చేయడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. తడి, పొడిచెత్తను ఎలా వేరు చేయాలి, రహదారుల క్లీన్ అండ్ గ్రీన్, వ్యక్తి గత మరుగుదొడ్ల వినియోగం తదితర అంశాలపై ప్రజలకు ఎక్కడా కూడా అవగాహన కల్పించలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు పోటీ పడితే... ఇక్కడ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యారని చెప్పుకోవచ్చు.
కమిషనర్ పర్యవేక్షణ శూన్యం..
2024–25 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో జనగామ మున్సిపల్ 50వేల నుంచి 3 లక్షల జనాభా విభాగంలో రాష్ట్రంలో 78, జాతీయ స్థాయిలో 466 ర్యాంకు సాధించింది. 2023–24లో సౌత్‌జోన్‌లో నంబర్ వన్‌గా నిలిచిన జనగామ.. నేడు దిగువ స్థాయికి పడిపోయింది. కమిషనర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణ, అజమాయిషీ లేకపోవడంతో శానిటేషన్ నిర్వహణ గాడి తప్పింది. ఇంటింటికీ చెత్త సేకరణలో 68 శాతం, తడి, పొడిచెత్త వేరు చేయడంలో 38 శాతం, ఎరువుగా తయారు చేయడం 98శాతం, ప్రధాన కూడళ్లలో చెత్త నిల్వలు లేకుండా నియంత్రణ(నో స్టార్), ఓడీఎఫ్ (డబుల్ ప్లస్) ఆయా కేటగిరీల్లో కేంద్రం విడుదల చేసిన ఫలితాల్లో జనగామ ర్యాంకు ఈ విధంగా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో అట్టడుగు స్థాయికి దిగజారి పోవడంతో.. మున్సిపల్ అధికారులు వీటిని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.
అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు.. చెత్త సేకరణ
పట్టణంలో డ్రెయినేజీ, శానిటేషన్ నిర్వహణ ఇంకా మెరుగు పడడం లేదు. బాలాజీనగర్, కుర్మవాడ, జ్యోతినగర్, కుర్మవాడ, శ్రీవిలాస్ కాలనీ (పలు ప్రాంతాలు) హౌసింగ్ బోర్డు తదితర కాలనీల పరిధిలో డ్రెయినేజీల పరిస్థితి అధ్వానంగా మారింది. మురికి నీరు నిండి రోడ్లపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. గతంలో సాక్షి వరుస కథనాలతో అధికారులు స్పందించినా.. అప్పటికప్పుడు హడావుడి చేసి మళ్లీ గాలికి వదిలేస్తున్నారు. రోడ్లపై రోజు వారీగా చెత్త సేకరణ తూతూ మంత్రంగా మారిపోయింది. విద్యలో జనగామ జిల్లా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేందుకు శ్రద్ధ చూపిస్తున్న ఉన్నతాధిరులు.. స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం ఎందుకు పోటీ పడడం లేదని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పట్టణ వీధులు, ప్రధాన రహదారులు మురికి కూపంగా మారిపోతున్నాయి. వరద నీరు, డ్రెయినేజీల నిర్వహణ, చెత్త సేకరణ తదితర వాటిని పర్యవేక్షించేందుకు కమిషనర్ ఒక్క వార్డులో కూడా పర్యటించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
జనగామ పురపాలికకు రాష్ట్రంలో 78, జాతీయ స్థాయిలో 466 ర్యాంకు
తడి, పొడిచెత్త వేరులో అట్టర్ ప్లాప్
అధ్వానంగా శానిటేషన్ నిర్వహణ