ఆర్టీసీకి మహా‘లక్ష్మి కళ’ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి మహా‘లక్ష్మి కళ’

Jul 23 2025 12:25 PM | Updated on Jul 23 2025 12:25 PM

ఆర్టీసీకి మహా‘లక్ష్మి కళ’

ఆర్టీసీకి మహా‘లక్ష్మి కళ’

హన్మకొండ: ఆర్టీసీకి మహాలక్ష్మి కళ సంతరించుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ప్రగతి రథ చక్రాలు పరుగులందుకున్నాయి. గతంలో ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణించేవారు సైతం ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల వైపు మళ్లారు. పథకానికి ముందు 70 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో పథకం అమలయ్యాక 93 శాతానికి పెరిగింది. పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 110 నుంచి 120 శాతానికి చేరుకుంది. మహిళలకు ఫ్రీ జర్నీ కావడంతో వారి కుటుంబ సభ్యులు (పురుషులు) కూడా ఆర్టీసీలోనే ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత బస్సు సొమ్మును ఆర్టీసీకి చెల్లిస్తుండడంతో సంస్థ ఆర్థిక లేమి నుంచి క్రమంగా బయటపడుతోంది.

వరంగల్‌ రీజియన్‌లో ఇలా..

మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం 2023 డిసెంబర్‌ 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటినుంచి నేటి వరకు వరంగల్‌ రీజియన్‌లో 15,41,10,000 మంది మహిళలు ప్రయాణించి రూ.688,35,58,000 చార్జీలు ఆదా చేసుకున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం నాటి నుంచి నేటి వరకు ఉచిత, చార్జీలు చెల్లించిన ప్రయాణికులు మొత్తం 23,98,67,000 ప్రయాణించగా.. రూ.1401,63,14,000 ఆదాయం వచ్చింది. ఇందులో చార్జీలు చెల్లించిన ప్రయాణికులు 8,57,58,000 ఉన్నారు. వీరి ద్వారా రూ.713,27,56,000 ఆదాయం వచ్చింది. మొత్తం ప్రయాణికుల్లో ఉచిత ప్రయాణం చేసిన వారు 64శాతం మంది ఉన్నారు. వీరి ద్వారా ఆర్టీసీకి 49శాతం ఆదాయం వచ్చింది. చార్జీలు చెల్లించిన వారు 36శాతం ప్రయాణించగా వీరి ద్వారా 51శాతం ఆదాయం వచ్చింది.

నేడు అన్ని బస్‌డిపోలు, స్టేషన్‌లలో సంబురాలు

ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసిన సందర్భంగా నేడు (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్‌ ఆర్టీసీ సంబురాలు జరుపుతోంది. ఈ మేరకు వరంగల్‌ రీజియన్‌లోని అన్ని డిపోలు, ప్రధాన బస్‌ స్టేషన్‌లలో మేనేజర్లు ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి పథకంపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇప్పటికే వ్యాస రచన, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అదే విధంగా ఆర్టీసీ బస్సులో క్రమం తప్పకుండా ప్రయాణించే ఐదుగురు మహిళలను ఎంపిక చేసి సన్మానించనున్నారు. వారికి బహుమతులు అందించనున్నారు. ఈ సంబరాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులను ఆహ్వానించారు. వరంగల్‌ బస్‌స్టేషన్‌లో జరిగే సంబరాల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు.

వరంగల్‌ రీజియన్‌లోని డిపోల వారీగా ప్రయాణికులు, ఆదాయం వివరాలు (లక్షల్లో)...

సంస్థకు అనూహ్యంగా పెరిగిన

ప్రయాణికులు

ఉచిత ప్రయాణంతో

93 శాతానికి పెరిగిన ఓఆర్‌

ఆర్థికలేమి నుంచి

బయటపడుతున్న సంస్థ

నేడు రీజియన్‌ పరిధిలోని

అన్ని డిపోల్లో సంబురాలు

డిపో మహాలక్ష్మి నాన్‌ మహాలక్ష్మి

ప్రయాణికులు ఆదాయం ప్రయాణికులు ఆదాయం

హనుమకొండ 305.68 9658.61 128.93 8351.40

వరంగల్‌–1 132.63 5541.54 101.14 15325.45

వరంగల్‌–2 127.35 7818.34 105.23 12972.48

పరకాల 147.91 5920.53 83.28 4221.54

భూపాలపల్లి 144.71 7447.00 77.25 6428.55

జనగామ 226.64 10897.12 112.77 7492.23

మహబూబాబాద్‌ 138.31 5956.19 68.15 3389.06

నర్సంపేట 173.34 7335.12 98.55 6357.02

తొర్రూరు 144.52 8261.13 82.27 6789.83

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement