
జిల్లాలో యూరియా కొరత లేదు
జనగామ/జఫర్‌గఢ్: జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. గురువారం జనగామలోని కావేరి, సాయిరాం ఫర్టిలైజర్ షాపులను డీఏఓ కట్ట అంబికాసోనీతో కలిసి తనిఖీలు చేపట్టిన కలెక్టర్ జఫర్‌గఢ్‌లో వెంకటేశ్వర ఎరువుల షాపుతోపాటు రైతు ఆగ్రోస్ సెంటర్‌ను తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో ఇప్పటి వరకు జరిగిన ఎరువుల విక్రయాల స్టాక్ రిజిస్ట్టర్, ప్రస్తుత నిల్వలను పరిశీలించారు. ఆయా దుకాణాల్లో ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు కలెక్టర్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్ని ఎకరాల పొలం సాగు చేస్తున్నారు.. కొనుగోలు చేసిన యూరియా బస్తాలు ఎన్ని.. అసలు అవసరం ఎంత.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశారు.సాయిరాం ఫర్టిలైజర్ దుకాణంలో ధరల పట్టిక, స్టాక్ వివరాలు చూపించే బోర్డు కనిపించకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీగా యూరియా విక్రయించే సమయంలో రైతు ఫోన్ నంబర్‌తోపాటు సమగ్ర సమాచారం రశీదులో నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో 3,560 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. మార్క్ ఫెడ్‌లో ఈ సీజన్‌కు సరిపోయే విధంగా బఫర్ స్టాక్ సైతం నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 89777 45512 ద్వారా సంప్రదించాలని సూచించారు. మండలాలు, గ్రామాల్లో యూరియా కొరత సృష్టించకుండా సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. జఫర్‌గఢ్‌లో ఏఓ కరుణాకర్‌రెడ్డిని రైతులతో మాట్లాడించి ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా తీసుకున్నారు. ఏ రేటుకు తీసుకున్నారు. ఏమైన ఇబ్బందులు ఎదురయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట తహసీల్దార్ రాజేష్‌రెడ్డి, ఏఓ కరుణాకర్‌రెడ్డి, ఆర్‌ఐలు బలరాం, దేవేందర్ ఉన్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
జనగామ: వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాలతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారులు స్పందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి 90523 08621 ఫోన్ నంబర్ కేటాయించినట్లు తెలిపారు. కంట్రోల్ రూం సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. భారీ వర్షాలతో వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం తదితర విపత్కర పరిస్థితులు ఎదురైన సందర్భంలో కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
రైతుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
కలెక్టర్ రిజ్వాన్‌బాషా