
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జనగామ: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు, ఆయా శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం జనగామ చంపక్‌హిల్స్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌లతో కలిసి ఆయన పరిశీలించారు. చిన్న పిల్లల వార్డుకు వెళ్లి వైద్య సేవలపై ఆరా తీశారు. సమయానికి వైద్యులు వచ్చి చూస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎంసీహెచ్‌లో సేవలు బాగున్నాయన్నారు. అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండడంతో పాటు మందుల కొరత లేకుండా చూసుకోవాలనిఅన్నారు.
ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టాలి
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ఆయా శాఖల అధికారులు కష్టపడి పనిచేయాలని, జిల్లాలో ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై మున్సిపల్, పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలతో పాటు క్షేత్రస్థాయి సందర్శనలు చేయాలన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్‌లో ఇప్పటి వరకు 40 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి 54,148 మందికి స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. సమీక్షలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లిర్జున్‌రావు, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగమణి, ఎంసీహెచ్, డీహెచ్ సూపరింటెండెంట్లు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ రాజలింగం,ప్రోగ్రాం ఆఫీసర్స్, వైద్యులు తదితరులు ఉన్నారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
బచ్చన్నపేట: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. అలాగే మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో పర్యటించి డెంగీ పాజిటివ్ వచ్చిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి రోగులతో మాట్లాడారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ అశోక్‌కుమార్, కమలహాసన్, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి
ఎంసీహెచ్ సేవలు బాగున్నాయి..
సీజనల్ వ్యాధుల నియంత్రణ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు