
పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలి
జనగామ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని, సంక్షేమ ఫలాలు పేదలకు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సీఎస్ రామకృష్ణారావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్‌లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లలో భోజన, మౌలిక వసతుల ఏర్పాటు, వనమహోత్సవంలో మొక్కలు నాటడడం, మహాలక్ష్మి పథకం తదితర అంశాలపై సమీక్ష చేశారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు కలెక్టర్లు, అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను సూర్యాపేట నుంచి తెప్పిస్తున్నామని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యంత ఇస్తున్నందున ఇసుక కొరత రాకుండా ఉండేందుకు నల్లగొండ జిల్లా నుంచి కూడా ఇసుకను కేటాయించాలని కోరారు.
వనమహోత్సవాన్ని విస్తృతంగా చేపట్టాలి
జిల్లాకు కేటాయించిన 30.50లక్షల మొక్కల లక్ష్యాలను సాధించేందుకు వన మహోత్సవం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టాలన్నారు. గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ సమయంలో నోటీసు బోర్డులను పరిశీలించి స్టాక్‌ను పర్యవేక్షించాలన్నారు. ఎరువులు విత్తనాల కొరత రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ మాధురిషా, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపిరామ్, కొమురయ్య, డీఆర్‌డీఓ వసంత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వీసీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్,
కొండా సురేఖ, లక్ష్మణ్‌కుమార్