
ఉపాధి కూలీలకు బీమా
జనగామ రూరల్: గ్రామాల్లో వలసలు నివారించి పని కోరిన ప్రతిఒక్కరికీ స్థానికంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా కూలీలు తమ అవసరాలకు ఉపాధి పొందుతుండగా వారికి మరో ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. కూలీలతో కొంత ప్రీమియం చెల్లింపజేసి వారికి బీమాను కల్పించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ఇప్పటికే ఉపాధి హామీలో ఉన్న కూలీలకు ఎవరెవరికీ బీమా ఉంది, లేనివారితో బీమా చేయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు జిల్లాలో బీమా లేని వారి వివరాలను సేకరించి వారిని బీమా చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఏటా రూ.20 బీమాకు జమ
జిల్లాలో మొత్తం 1.21 లక్షల యాక్టివ్ జాబ్‌కార్డులు ఉండగా.. ఇందులో 2.31 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరందరికీ బీమా వర్తించనుంది. సురక్ష బీమా యోజన కోసం 18 నుంచి 71 ఏళ్లలోపు వారు జాతీయ బ్యాంకుల్లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఖాతా ఆధార్‌కార్డుతో అనుసంధానమై ఉండాలి. బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచీలో ఖాతా నుంచి ఏటా రూ.20 బీమాకు జమ చేయాలని అంగీకారపత్రం ఇవ్వాలి. పేరు నమోదు చేసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణించినా పూర్తిగా అంగవైకల్యం కలిగినా.. రూ.2 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంటుంది. పాక్షికంగా అంగవైకల్యం కలిగినా.. రూ.లక్ష పరిహారం అందుతుంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 50 రోజుల్లో రూ.20 కోట్ల మేరకు పనులు చేపట్టారు.
●
ఉపాధి కూలీలందరికీ వర్తించేలా..
ఉపాధి కూలీలకు బీమా అనేది నిరంతరం ప్రక్రియ. దీనికి చివరి తేదీ అంటూ ఏమీ లేదు. జిల్లాలో ఎవరెవరికీ బీమా లేదన్న విషయాన్ని బ్యాంకుల వద్ద సేకరించి లేని వారికి బీమా కల్పించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ప్రతి ఒక్కరికీ బీమా కల్పించడమే లక్ష్యంగా అవగాహన కల్పిస్తున్నాం.
– వసంత, డీఆర్‌డీఓ
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద అమలు
బీమా లేని వారిని గుర్తించే పనిలో అధికారులు
జిల్లాలో 2.31 లక్షల ఉపాధి కూలీలు

ఉపాధి కూలీలకు బీమా

ఉపాధి కూలీలకు బీమా

ఉపాధి కూలీలకు బీమా