
సత్వర న్యాయసేవలు అందించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ
జనగామ రూరల్: ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టుకు సంబంధించిన సబ్ జైల్, పొక్సో కేసులు, ఇతర జిల్లా జైల్‌లో ఉన్న జనగామ కోర్టుకు సంబంధించిన విచారణ ఖైదీల గురించి జాతీయ న్యాయ సేవ అధికారి సంస్థ ఆదేశాల మేరకు సమీక్ష సమావేశం నిర్వహించారు. బెయిల్ మంజూరు అయి ఆర్థిక స్థోమత లేని పేదవారి గురించి, షూరిటీలు పెట్టుకోలేని విచారణలో ఉన్న ఖైదీల గురించి చర్చించారు. సమీక్షలో సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, సబ్ జైల్ సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ అవార్డుకు
దరఖాస్తు గడువు పొడిగింపు
జనగామ రూరల్: జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు గడువును పొడిగించనట్లు డీఈఓ భోజన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 17వ తేదీ వరకు పొడిగించారని, పూర్తి మార్గదర్శకాలు ఆన్‌లైన్ పోర్టర్‌లో చూడాలని కోరారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఏఎంసీ అభివృద్ధే లక్ష్యం
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం గా పని చేస్తున్నామని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం పాలకవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన కార్యాలయ భవనం చుట్టూ ప్రహారీగోడ నిర్మాణం కోసం చర్చించామన్నారు. పెండింగ్‌లో ఉన్న మూడవ కవర్‌షెడ్ నిర్మాణ పనులను పునరుద్ధరిస్తామన్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు పాలక వర్గం ఆమోదం తీసుకుంటామన్నారు. అనంతరం మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించిన జీవన్, నూతనంగా ఖరీదు లైసెన్స్ పొందిన వ్యాపారిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, డైరెక్టర్లు బుట్‌రెడ్డి శ్రీలత రెడ్డి, నామాల శ్రీనివాస్, బానోత్ బన్సీ నాయక్, బొట్ల నర్సింగరావు, నీలం మోహన్, నాగ బండి రవీందర్, తోటకూరి రమేష్ యాదవ్, శీలం కొండల్‌రెడ్డి, వనపర్తి శ్రీనివాస్, బంద కుమారి, బాష్మియా, వర్ష సిద్దేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
రైతు ముంగిట
విద్యుత్ సేవలు
● పొలంబాటతో మంచి ఫలితాలు
● తెలుగులో ఎస్టిమేషన్ కాపీలు
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాదవ్
జనగామ: రైతులకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ఎన్‌పీడీసీఎల్ సంస్థ చేపట్టిన అనేక కార్యక్రమాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఆ శాఖ జిల్లా అధికారి (ఎస్‌ఈ) టి. వేణుమాదవ్ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 నుంచి 24 సంవత్సరం వరకు 2,046 విద్యుత్ సర్వీసులు మంజూరీ చేయగా, 2025లో ఈనెల 15వ తేదీ వరకు 2,241(9శాతం) పెరిగినట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ సర్వీసుల విషయంలో సత్వర చర్యలు ఉంటున్నాయన్నారు. విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమంలో 216 లూజు లైన్లు, 211 వంగిన ఫోల్స్, 2,121 మధ్య స్తంభాలను నూతనంగా అమర్చామన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లను బిగించాలని రైతులకు అవగాహన కల్పించడంలో విజయం సాధించామన్నారు. మెటీరియల్ కోసం రైతులు దరఖాస్తు చేసుకునేందుకు తెలుగులో ఫారాలు అందుబాటులో ఉంచడంతో సులభతరమవుతుందన్నారు. విద్యుత్తు అదనపు లోడ్‌కు అనుగుణంగా కొత్తగా 820 ట్రాన్స్‌ఫార్మర్లు (లోడ్ సామర్ధ్యం 51,660 కేవీఏ) పెంచినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయిన సమయంలో 24 గంటలు, రూరల్ ఏరియాలో 48 గంటల్లో రీప్లేస్‌మెంట్ చేస్తున్నామన్నారు. రైతులకు విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైన సమయంలో టోల్ ఫ్రీనంబర్ 1912 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.