
నో బ్యాక్ బెంచీ సిట్టింగ్
జనగామ: మలయాళ చిత్రం స్థానార్థి శ్రీ కుట్టన్ స్ఫూర్తిగా సర్కారు బడుల్లో విద్యార్థుల సిట్టింగ్ మారిపోతుంది. బడిలో బ్యాక్ బెంచీకి స్వస్తి పలుకుతూ.. యూ ఆకారంలో కూర్చున్న విధానం ప్రాముఖ్యతను గొప్పగా చూపించారు. ఈ మూవీ విడుదలైన తర్వాత కేరళ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఈ విధానాన్ని అమలు చేయగా.... ఇప్పుడు జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు డీఈఓ భోజన్న ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల జీవితంలో బ్యాక్ బెంచ్ కళంకాన్ని ఎదుర్కొనే విద్యార్థులకు తీపికబురుగా చెప్పుకోవచ్చు.
పాఠశాల తరగతి గదిలోకి ఎంటర్ కాగానే వరుస క్రమంలో కూర్చునే విద్యార్థులు కనిపించడం సర్వసాధారణం. విద్యార్థి ఎత్తును ఆధారంగా పరిగణించడం.. చదువులో రాణించే వారిని ముందు బెంచీలో కూర్చోబెట్టడం నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తుంది. ఇలా ఒకటి, రెండు వరుస క్రమంలో కూర్చునే విద్యార్థులు తెలివి కలిగి ఉండడం.. తర్వాత స్టెప్పుల్లో చదువుకునే పిల్లలు బ్యాక్ బెంచీగా ముద్ర వేసుకుని.. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే... వారు అంతేలే అని వదిలేసే పరిస్థితి. ఇలా పది పూర్తి చేసుకున్న తర్వాత ఇంటర్, డిగ్రీ లేదా బీటెక్ ఉన్నత చదువులకు వెళ్లే వరకు... ఒరేయ్ బ్యాక్ బెంచీ అంటూ పిలిచే పరిస్థితి నేటికీ చూస్తూనే ఉన్నాం. బ్యాక్ బెంచీ విద్యార్థుల జీవితాలను ఆధారంగా తీసుకుని మలయాళ దర్శకుడు తీసిన చిత్రం దేశంలోని ప్రతిఒక్కరిని మేలుకొలిపింది. ముఖ్యంగా విద్యాశాఖను. పాఠశాల తరగతి గదిలో బ్యాక్ బెంచీకి స్వస్తి పలుకుతూ ‘యూ’ ఆకారంలో పిల్లలను కూర్చో బెట్టి పాఠాలు బోధించే పద్ధతిని ఇప్పుడు అనేక పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.
జిల్లాలో యూ ఆకారంలో....
జిల్లాలో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64 యూపీఎస్, ఉన్నత 103 పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో బ్యాక్ బెంచీ విధానానికి స్వస్తి పలికి యూ కారంలో కూర్చోబెట్టిలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీతరగతి గదిలో యూ ఆకారం సిట్టింగ్‌తో విద్యార్థులందరి దృష్టి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల బోధన వైపు ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పిల్లల్లో అభ్యసన మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. సెమీ సర్కిల్ లేదా యూ ఆకార అమరిక, సాంప్రదాయ సీటింగ్‌కు ఉపహరిస్తుంది. తరగతి గదిలో విద్యార్థులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం, సహచరులతో చురుకుగా మాట్లాడే వెసులుబాటు దొరకుతుంది. తక్కువ మాట్లాడటం చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులు తక్కువగా ఉన్న తరగతుల్లో బోధనతో పాటు ఉపాధ్యాయుల వ్యక్తిగత పరిశీలనకు అనువుగా ఉంటుంది. పరధ్యానంగా ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులు సులభంగా గమనించే వీలు కలుగుతుంది. సమూహ అభ్యసన కోసం నలుగురు నుంచి ఆరుగురు విద్యార్థులతో కూడిన చిన్న సమూహాల ఏర్పాటు చేయాల్సిన సమయంలో విద్యార్థులు త్వరగా మరొక జత డెస్క్‌ల వైపు తిరిగి గ్రూప్ డిస్కర్షన్ చేసుకోవచ్చు.