
భవిష్యత్ తరాలకు నీటికొరత రావొద్దు
రఘునాథపల్లి: భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా అన్నారు. మన జిల్లా మన నీరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్ ఆవరణలో డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి ఇంకుడుగుంతల నిర్మాణానికి కంకర పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భజలాల పరిరక్షణ అనేది ఒక సామాజిక బాధ్యత అన్నారు. ఈ భూగర్భ జల మట్టం ప్రమాదస్థాయికి చేరకముందే భూగర్భ జలాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మన జిల్లా మన నీరులో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు మొదలగు వాటిలో ఇప్పటికే 7వేల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టామన్నారు. ఇందిరమ్మ ఇంటిలో ఇంకుడు గుంత తప్పనిసరి అన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టి భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు రాకుండా ఇంకుడు గుంతలు దోహదపడుతాయన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కాగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో దేశంలోనే 50 అత్యుత్తమ జిల్లాల్లో రాష్ట్రం నుంచి జిల్లాకు చోటు దక్కడంతో కలెక్టర్‌ను డీసీపీ, సీఐ, ఎస్సైలు శాలువా, మెమోంటోతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఫారెస్ట్ ఎఫ్‌ఆర్‌ఓ కొండల్‌రెడ్డి, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, తహసీల్దార్ ఫణికిషోర్, ఎస్సై దూదిమెట్ల నరేష్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శోభారాణి, బీట్ ఆఫీసర్ రమేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా,
డీసీపీ రాజమహేంద్రనాయక్