
కొత్త కార్డులొచ్చేస్తున్నాయ్
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులను ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నేరవేరుస్తున్నారు. ప్రజా పాలనతో పాటు మీసేవలో దరఖాస్తు చేసుకున్న కుటుంబాల ఎదురుచూపులకు కొద్ది గంటలే మిగిలిఉంది. నేడు (సోమవారం) సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి కొత్త రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సుదీర్ఘ కాలం పాటు తెల్లరేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ బియ్యంకు దూరంగా ఉన్న వారంతా.. సెప్టెంబర్ మాసం నుంచి రేషన్ ఉచిత బియ్యాన్ని పొందనున్నారు. జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.
న్యూ రేషన్ కార్డులు 2,096
జిల్లాలో కొత్త రేషన్ కార్డులు 2,096 మందికి వచ్చాయి. ప్రజా పాలనతో పాటు మీసేవలో దరఖాస్తు చేసుకోగా ఎంక్వరీ తర్వాత వీటిని అప్రూవల్ చేశారు. దీంతో చాలా మంది లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో తమ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోగా, అధికారికంగా నేటి (సోమవారం) అందుకోనున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు గతంలో కార్డులు ఉండి, తమ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల చేరికకు ఏళ్ల తరబడి నిరీక్షించారు. న్యూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పిల్లల చేరికకు సైతం అవకాశం ఇవ్వగా, రెండు కలిపి 28,967 మంది (యూనిట్స్) కొత్తగా చేరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ మాసంలో మూడు నెలల బియ్యం కోటా ఒకేసారి ఇవ్వగా.. కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ మాసం నుంచి ఉచిత బియ్యం అందనున్నాయి. ఇదిలా ఉండగా ఒంటరి మహిళలు, ఆదరణ లేని అత్యంత దయనీయ స్థితిలో ఉన్న నిరుపేదలకు అంత్యోదయ (35 కిలోల బియ్యం), అన్నపూర్ణ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భరోసా కల్పించే విధంగా మంజూరీ చేయాలని ప్రభుత్వాన్ని బాధిత కుటుంబాలు కోరుతున్నారు.
జిల్లాలో 335 రేషన్ దుకాణాలు
జిల్లాలో 335 రేషన్ షాపులు ఉన్నాయి. పాత, కొత్త రేషన్ కార్డులు కలుపుకుని 1,63,283కు పెరగగా, 5,06,722 మంది ఉచిత బియ్యం పొందుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నెలవారి కోట సన్న బియ్యం 3,221.188 మెట్రిక్ టన్నులను పెంచింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి న్యూ రేషన్ కార్డుల కోసం వేలాది కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నారు. 2020లో కొంత మంది అర్హులైన నిరుపేదలకు కొత్త కార్డులను అందించి తిరిగి నిలిపివేశారు. ఇన్నాళ్లకు న్యూ రేషన్ కార్డులు రానుండడంతో పేదోళ్ల కుటుంబాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి.
ఆరేళ్ల ఎదురుచూపులకు మోక్షం..
ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. భర్త ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొత్త రేషన్ కార్డు కోసం అనేక సార్లు అర్జీ పెట్టుకున్నా రాలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉచిత రేషన్ బియ్యం పొందలేకపోయాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని పథకాలు కూడా అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త తెల్ల రేషన్ కార్డు మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది.
– తాళ్లపల్లి మానస, గృహిణి,
చిన్న పెండ్యాల, చిల్పూరు
నేడు సూర్యాపేటలో
ప్రారంభించనున్న సీఎం
జిల్లాలో 2,096 కొత్తరేషన్ కార్డులు
కొత్తగా 28,967
కుటుంబ సభ్యుల చేరిక
ప్రతీ నెల
3,221,188 మెట్రిక్ టన్నుల కోటా

కొత్త కార్డులొచ్చేస్తున్నాయ్

కొత్త కార్డులొచ్చేస్తున్నాయ్