
అంతర్జాతీయ దివ్యాంగ క్రీడాకారిణికి ఆర్థికసాయం
జనగామ: ప్రతిభ ఉంటే అంగ వైకల్యం సైతం అడ్డురాదని నిరూపించారు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం విశ్వనాథపురంకు చెందిన దివ్యాంగురాలు మాచర్ల కృషివేణి. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు ఎదురీదుతూ విజయ తీరాలకు చేరుకున్న ఆ క్రీడాకారిణి.. ముందడుగు వేయాలంటే ఆర్థిక వనరులు అడ్డువస్తూనే ఉన్నాయి. మనసున్న దాతల సహాయంతో దేశ, విదేశాల్లో జరిగే క్రీడాపోటీల్లో తన సత్తాను నిరూపించుకుంటున్నారు కృష్ణవేణి. ఈ నెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మలేషియాలో జరుగనున్న ఏషియన్ పేరా టైక్వాండో గేమ్స్‌కు భారత దేశం తరఫున కృష్ణవేణి అర్హత సాధించారు. జిల్లా, రాష్ట్రం, దేశంలో ఎన్నో పథకాలను సొంతం చేసుకున్న ఆమెకు...మలేషియా పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక పరిస్థితులు అడ్డొస్తున్నాయి. కనీసం విమాన చార్జీలు సైతం లేని దయనీయ పరిస్థితుల్లో మానవతా వాదుల సహకారాన్ని కోరుతున్నారు. కృష్ణవేణి టాలెంట్‌ను చూసిన తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజుగౌడ్ వెంటనే కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా ప్రతినిధులతో పాటు సంఘ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలకు ఈ విషయాన్ని చేరవేశారు. ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ అతికం గిరిగౌడ్, డాక్టర్ అతికం శ్రీనివాస్‌గౌడ్‌లు నాతి గణేష్ ద్వారా రూ.1.50 లక్షలు, గౌడ ప్రముఖులు మరో రూ.30వేలను ప్రకటించారు. ఆదివారం పట్టణంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాల్నె వెంకట మల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో దివ్యాంగురాలు మాచర్ల కృష్ణవేణిని శాలువాతో సత్కరించి, నగదుకు సంబంధించి చెక్కులను అందించారు. ఇందులో కరాటే కోచ్ అబ్బాస్, గోపగోని సుగుణాకర్, చిలువేరు అభిగౌడ్, బూడిది గోపి, వెంకట మల్లయ్య, దూడల సిద్ధయ్య, బైరగోని మల్లేశం, తాళ్లపల్లి రాజుగౌడ్, చీకట్ల నవీన్‌గౌడ్ దూడల రాజాసంపత్ గౌడ్ ఆర్థిక సాయం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బండకింది అరుణ్ కుమార్, కమ్మగారి నాగన్న, మహేందర్, బొల్లపల్లి విశ్వనాథ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.