మెట్‌పల్లిరూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమిలేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ పనిచేసిందని గుర్తుచేశారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఇందిరమ్మ చీరల పంపిణీ కంటే వాటి ప్రచారానికే రూ.కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. అయోధ్య రాముని పేరు చెప్పి ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్ ఆలయాలకు చేసిందేమిలేదని, దేవుని పేరు చెప్పి ఓట్లడగడం మాత్రమే తెలుసునని విమర్శించారు. ఆలయాల పేరు చెప్పి తన తండ్రి మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఏనాడు ఓట్లు అడగలేడని, కానీ మెట్‌పల్లిలో అయ్యప్ప ఆలయ నిర్మాణం చేయించారని, ఎన్నో ఆలయాల అభివృద్ధికి కృషి చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


