ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది ‘భారత రాజ్యాంగం’ | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది ‘భారత రాజ్యాంగం’

Nov 26 2026 11:50 PM | Updated on Nov 26 2026 11:50 PM

జగిత్యాలజోన్‌: ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది భారత రాజ్యాంగమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సామూహికంగా రాజ్యాంగంలోని పీఠికను చదివారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, చట్టబద్ధమైన పాలన, అందరికి ప్రాథమిక హక్కులు, పౌరుల విధులు, ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అనే అంశాలు భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ అందుతున్నాయన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ఆశయాలు, ఆదర్శాలు, విలువలను గౌరవిస్తూ, వాటిని పరిరక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి జి.సునీత రవీందర్‌రెడ్డి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డి.నాగేశ్వర్‌రావు, మొదటి అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ వై.జానకి, జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కటుకం చంద్రమోహన్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఘాట్‌రోడ్డు వెంట వాహనాలను అనుమతించాలి

మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లేందుకు ఘాట్‌రోడ్డు వెంట వాహనాలను అనుమతించాలని దిగువ కొండగట్టులో జగిత్యాల–కరీంనగర్‌ రహదారిపై దుకాణాదారులు, వాహనదారులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల జిల్లా వైపు నుంచి వచ్చే వాహనదారులను ఘాట్‌రోడ్డు వెంట అనుమతించకపోవడంతో దుకాణాదారులకు గిరాకీ దెబ్బతింటుందని, అలాగే వాహనదారులు జేఎన్‌టీయూ చెక్‌పోస్టు మీదుగా తిరిగి వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్నారని వివరించారు. సమస్యలను పలుమార్లు అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో రోడ్డుపై బైఠాయించాల్సి వచ్చిందన్నారు. ఎస్సై సందీప్‌ సంఘటనా స్థలానికి చేరుకొని, ఘాట్‌రోడ్డు మధ్య వరకు వాహనాలకు అనుమతిస్తామని హామీ ఇచ్చారు. ఘాట్‌రోడ్డు వెంట వెళ్లేందుకు బారీరికేడ్లు తొలగించడంతో స్థానికులు రాస్తారోకో విరమించారు.

జిల్లా అగ్నిమాపక శాఖ కార్యవర్గం

జగిత్యాలరూరల్‌/మెట్‌పల్లిరూరల్‌: తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర పౌర రక్షణ శాఖ జిల్లా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం కరీంనగర్‌లోని టీఎన్జీవో కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కె.నరేశ్‌, ఉపాధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి ప్రశాంత్‌, కోశాధికారిగా మాధవ్‌ ఎన్నికయ్యారు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులు డి.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అడ్‌ హక్‌ కమిటీ అధ్యక్షుడు జి. దామోదర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, కోశాధికారి కృష్ణ పర్యవేక్షణలో నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

మెడికల్‌ కళాశాల పనులు వేగవంతం చేయండి

జగిత్యాల: మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు. గురువారం ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భవన నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా గడువులోపు పూర్తి చేయాలని, పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్లు ఎలాంటి లోపాలు లేకుండా వేపనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మెడికో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, విద్యా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. సంబంధిత అధికారులు కళాశాల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement