మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు ఈ నెల 30న రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్షా వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. గురువారం ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి జేఎన్‌టీయూ, కొండగట్టు ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జేఎన్‌టీయూలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. హెలిప్యాడ్ వద్ద సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతిథి గృహం పరిసరాల్లో పరిశుభ్రత, విద్యుత్, తాగునీరు, భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ, గవర్నర్ పర్యటన నేపథ్యంలో జేఎన్‌టీయూ, హెలిప్యాడ్, అతిథిగృహం వద్ద పటిష్ట భద్రతతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రూట్ భద్రతపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ ఆంజనేయస్వామి నిజరూప దర్శనం చేసుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో అంజనారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు.
షెడ్యూల్ ఇదీ..
జగిత్యాల/మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామిని రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా ఈ నెల 30న దర్శించుకోనున్నారు. ఉదయం 9.25గంటలకు హైదరాబాద్ లోక్‌భవన్ నుంచి బయలుదేరి 9.30గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.40గంటలకు బయలుదేరి కొడిమ్యాల జేఎన్‌టీయూకు 10.30గంటలకు చేరుకున్న తర్వాత ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. 10.45– 11.30 గంటలవరకు గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజల అనంతరం జేఎన్‌టీయూలో 12.45 గంటలకు కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం జేఎన్‌టీయూ నుంచి హెలిక్యాప్టర్‌లో 1.30గంటలకు
హైదరాబాద్ బయలుదేరుతారు.


