జగిత్యాలఅగ్రికల్చర్: ఆత్మ నిధులను సద్వినియోగం చేసుకుని, వ్యవసాయంలో అధిక దిగుబడులను సాధించాలని జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ వి.భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ఆత్మ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాకు ఆత్మ ప్రాజెక్టు కింద నిధులు విడుదల అయ్యాయని, ఆ నిధులతో 70 క్షేత్ర ప్రదర్శనలు, ఒక అంతరాష్ట్ర రైతు సందర్శన, రాష్ట్రంలో 8 రైతు సందర్శనలు, జిల్లాలో 8 రైతు సందర్శనలు, జిల్లా స్థాయిలో 80 శిక్షణ కార్యక్రమాలు, ఒక అంతరాష్ట్ర శిక్షణ కార్యక్రమం, రాష్ట్ర స్థాయిలో 3 శిక్షణ కార్యక్రమాలు, 4 ఫార్మ్ స్కూల్స్ నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కమిటీ కన్వీనర్లు కాటిపెల్లి గంగారెడ్డి, తాళ్లపల్లి మల్లేశం, వాకిటి భూమరెడ్డి మాట్లాడుతూ, డివిజన్ స్థాయిలో రైతు సదస్సులు నిర్వహించాలని సూచించారు. గ్రామ, మండల స్థాయిలో జరిగే రైతు సమావేశాల్లో ఆత్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలని కోరారు. జిల్లా పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్ బి.ప్రకాష్, జిల్లా ఉద్యానశాఖాధికారి కట్ట లత, ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంజే సుధాకర్, టెక్నికల్ ఏడీఏ రాజులనాయుడు పాల్గొన్నారు.


